ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్
- భద్రతలో లోపాలు ఉండొద్దు.. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
తూఫాన్, జగిత్యాల :- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు దరూర్ క్యాంప్‌లోని ఈవీఎంల గోదామును జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత నిమిత్తం ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గోడౌన్‌లో యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు వెల్లడించారు. గోదాము వద్ద ఎలాంటి సాంకేతిక, భద్రతా లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధులు నిర్వర్తించే సిబ్బంది నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment