జీవో 252లో కొన్ని సవరణలు చేయండి -మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జీవో పై చర్చించడంతో పాటు వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తమ సంఘం ముఖ్యుల సమావేశం, 252జీవో ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, జర్నలిస్టుల నుండి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు, జీవో లో లోటుపాట్లపై చర్చించి, కొన్ని సవరణలు అవసరమనే అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రితో తెలిపారు. గతంలో అక్రెడిటేషన్ కార్డులతో డెస్క్ జర్నలిస్టులందరికీ కాకుండా కొందరికి మాత్రమే న్యాయం జరిగేదని, ప్రస్తుతం అలా కాకుండా బస్ పాస్ లతో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్...