పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని!
పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని!
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చాగోష్ఠి
క్యాన్సర్‌ను జయించేలా చేసింది అంబేద్కర్ పుస్తకమే: ప్రజాకవి జయరాజు
కన్ను మూసేదాకా పెన్ను మూసేది లేదు: సుద్దాల అశోక్ తేజ
అక్షరం మనిషిని అద్భుత కళాకారుడిగా తీర్చిదిద్దుతుంది: కవి యాకూబ్
హైదరాబాద్, తూఫాన్ బ్యూరో: మనిషి శరీరానికి భోజనం ఎంత అవసరమో.. మెదడుకు పుస్తకం అంతకంటే ముఖ్యమని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనిశెట్టి రజిత వేదికపై ‘పుస్తక స్ఫూర్తి/పుస్తకం ఒక దారిదీపం’ చర్చా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్ సభను ప్రారంభించగా, సుద్దాల అశోక్ తేజ, ప్రజాకవి జయరాజు ముఖ్య వక్తలగా పాల్గొన్నారు.
పుస్తకమే నా ఊపిరి: సుద్దాల "కన్ను మూసేదాకా పెన్ను మూసేదే లేదు.. పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లేదు" అంటూ సుద్దాల తన అక్షర నిబద్ధతను చాటుకున్నారు. ఆరో తరగతిలోనే మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ పుస్తకం తనను ప్రభావితం చేసిందని, ప్రేమ్ చంద్ రచనలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని గుర్తు చేసుకున్నారు. సమాజానికి నేడు భజనకారుల కంటే సృజనకారుల అవసరం ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన పాడిన ‘నేలమ్మా నేలమ్మా..’ గీతం సభికులను ఉర్రూతలూగించింది.
మృత్యువును జయించిన అక్షరం: జయరాజు ప్రజాకవి జయరాజు తన జీవితానుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 20 ఏళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి మృత్యువుకు దగ్గరైన సమయంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ‘దినచర్య’ పుస్తకం తనలో జీవించే స్ఫూర్తిని నింపిందని వెల్లడించారు. ఆ సంకల్ప బలంతోనే క్యాన్సర్‌ను జయించి నేడు మీ ముందు నిలబడ్డానని, అక్షరం ప్రాణాంతక రోగాలను సైతం మాయం చేస్తుందని స్పష్టం చేశారు.
మేధస్సును మేల్కొలిపే ఆయుధం: యాకూబ్ భూమిలోకి వెళ్లిన విత్తనం వృక్షంగా మారినట్లే, పుస్తకంలోని అక్షరం మనిషిని గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దుతుందని కవి యాకూబ్ అభివర్ణించారు. జయరాజు, సుద్దాల వంటి వారి జీవితానుభవాలు నేటి తరానికి దిక్సూచి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాములు సమన్వయకర్తలుగా వ్యవహరించగా, బుక్ ఫెయిర్ సెక్రటరీ వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వక్తలను ఘనంగా సన్మానించారు.
Comments
Post a Comment