రంగుల కేళి.. ఇందిరా పార్కులో హోలీ సంబరాలు
- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ - వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు తూఫాన్,హైదరాబాద్ :- నగరంలోని ఇందిరా పార్కులో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్వహించిన ఈ రంగుల పండుగలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో అసోసియేషన్ సభ్యులు ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. హోలీ పండుగ మానవ సంబంధాల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ సమాజంలో ఐక్యతను చాటుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా వాకర్స్ అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం సభ్యులందరికీ అసోసియేషన్ ప్రతినిధులు అల్పాహారం ఏర్పాటు చేశారు.