అక్షరాల్లో ‘క్వియర్’ అనుభవాల ఆవిష్కరణ
అక్షరాల్లో ‘క్వియర్’ అనుభవాల ఆవిష్కరణ
- హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆసక్తికరంగా సాగిన చర్చాగోష్టి
- సమాజపు ముద్రలను చెరిపివేసి.. మనిషిగా చూడాలి: రచయితల ఆకాంక్ష
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా ఆదివారం 'క్వియర్ అనుభవాలు - సాహిత్య సృజన' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టి ఆలోచింపజేసింది. దీప్తి సిర్ల మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రచయితలు అవిజిత్ కుందు, పారస్ వత్స్, రచన ముద్రబోయిన, అపర్ణ తోటలు పాల్గొని తమ జీవిత ప్రయాణంలోని ఒడిదుడుకులను, సాహిత్య అనుభవాలను పంచుకున్నారు.
ముద్రలు వద్దు.. మనుషులుగా చూడండి
రచయిత అవిజిత్ కుందు మాట్లాడుతూ.. క్వీర్ సాహిత్యాన్ని కేవలం ఒక ప్రత్యేక ముద్రతో చూడకుండా, అది సమాజంలోని ఒక వర్గం నుంచి వస్తున్న సాధారణ సాహిత్యంగానే గుర్తించాలని కోరారు. తన 'మెన్ డోంట్ డ్యాన్స్' పుస్తకానికి మహిళల నుంచి కూడా విశేష స్పందన వచ్చిందని, భావోద్వేగాల పరంగా మనందరం ఒకటేనని పేర్కొన్నారు. మరో రచయిత పారస్ వత్స్ తన ఆత్మకథ 'నజీత్' ప్రచురణ తర్వాత ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నందుకు రాత్రికి రాత్రే కోల్‌కతాలోని ఓ పాఠశాల తనను ఉద్యోగం నుంచి తొలగించిందని, పుస్తకం ప్రజలను ఎంతగా భయపెడుతుందో దీని ద్వారా అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షణ కవచం.. మా భాష
ట్రాన్స్‌జెండర్ కార్యకర్త రచన ముద్రబోయిన మాట్లాడుతూ.. హిజ్రా కమ్యూనిటీకి ఉండే ప్రత్యేక రహస్య భాష తమను కాపాడే ఒక రక్షణ కవచం (Guarding Tool) లాంటిదని తెలిపారు. నిరక్షరాస్యత, వివక్ష కారణంగా తమ కమ్యూనిటీలోని వారు పాఠశాల విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రచయిత్రి అపర్ణ తోట మాట్లాడుతూ.. తెలుగులో క్వీర్ సాహిత్యానికి సంబంధించి గతంలో కేవలం బాహ్య దృక్కోణం (External point of view) నుంచి మాత్రమే రచనలు వచ్చాయని, అయితే 2020 తర్వాత వస్తున్న కథల్లో లోతైన పరిశోధన కనిపిస్తోందని విశ్లేషించారు.
ఘనంగా సన్మానం
కార్యక్రమం అనంతరం రచయిత్రి శిలా లోలిత ఆధ్వర్యంలో చర్చాగోష్టిలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, సమన్వయకర్తలు ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాము తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment