కీసరలో వృద్ధురాలిపై దాడి: పుస్తెలతాడు దొంగిలించిన నిందితుడి అరెస్ట్
- చీర్యాల గ్రామంలో ఘోరం.. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తూఫాన్, కీసర :- ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలే లక్ష్యంగా తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి, ఆమె మెడలోని పుస్తెలతాడును తెంచుకెళ్లిన దారుణ ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన సింగిరెడ్డి మల్లమ్మ (75) అనే వృద్ధురాలు ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఉదయం సుమారు 5 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కత్తి అనిల్ కుమార్ పథకం ప్రకారం ఆమె ఇంటి తలుపు తట్టాడు. గుర్తుతెలియని వ్యక్తి ఇంత పొద్దున్నే తలుపు తట్టడంతో ఎవరా అని మల్లమ్మ తలుపు తీసింది. అంతే.. క్షణాల వ్యవధిలో నిందితుడు అనిల్ కుమార్ లోపలికి దూసుకొచ్చి, వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గింజుకునేలోపే మెడలోని పుస్తెలతాడును బలవంతంగా తెంచుకుని అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు...