పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....
38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పుస్తక స్ఫూర్తి’పై మేధోమథనం
వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు
తూఫాన్(హైదరాబాద్) :- అక్షరం మనిషిని ఆలోచింపజేస్తుందని, పుస్తకం జీవితానికి కొత్త దిశను చూపే దారిదీపమని పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘అనిశెట్టి రజిత’ వేదికపై ‘పుస్తక స్ఫూర్తి - పుస్తకం ఒక దారిదీపం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వక్తలను సన్మానించారు.
కోటి రూపాయలతో పుస్తకాల పంపిణీ: మంత్రి జూపల్లి
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో పఠనాసక్తిని పెంచేందుకు తమ శాఖ తరపున కోటి రూపాయల వ్యయంతో స్ఫూర్తిదాయక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘ప్రభాత’ అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఆడంబరాలు, వృథా ఖర్చులను వీడి ప్రజలు చైతన్యవంతులు కావాలని, ఇందుకోసం కవులు, కళాకారుల ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకుబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసు, సమన్వయకర్తలు ఒద్దిరాజు ప్రవీణ్, పేర్ల రాము తదితరులు పాల్గొన్నారు.
ఆలోచనా ధోరణిని మార్చేదే పుస్తకం: రమా మెల్కోటే
ప్రముఖ సామాజికవేత్త రమా మెల్కోటే ప్రసంగిస్తూ.. పుస్తక పఠనం మనిషి వ్యక్తిత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. కళాశాల రోజుల్లో చదివిన అస్తిత్వవాదం, మార్క్సిజం పుస్తకాలు తనలో స్వేచ్ఛ, బాధ్యత పట్ల అవగాహన కల్పించాయని గుర్తుచేసుకున్నారు. నేటి కాలంలో చరిత్ర వక్రీకరణలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. విభిన్న భావజాలాల పుస్తకాలు చదవడం ద్వారానే సత్యాన్ని గ్రహించే విచక్షణ లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
సంక్షోభాల నుంచి గట్టెక్కించే లైట్‌హౌస్: పాశం యాదగిరి
జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సంక్షోభాల సుడిగుండాల నుంచి గట్టెక్కించే ‘లైట్‌హౌస్’ వంటిది పుస్తకమని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అభివర్ణించారు. కేవలం చదవడం మాత్రమే కాకుండా, అక్షరాల్లోని సత్యాన్ని సమాజంతో పోల్చుకుంటూ ‘గ్రౌండ్ వెరిఫికేషన్’ చేసుకోవాలని ఆయన సూచించారు. పుస్తక జ్ఞానాన్ని నిత్య జీవితంతో సమన్వయం చేసుకున్నప్పుడే నిజమైన జ్ఞానం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.
మొదటి ఆర్టీఐ కార్యకర్త రామానుజులే: మాడభూషి శ్రీధర్
కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. పుస్తకం మనిషిలోని విమర్శనాత్మక ఆలోచనను మేల్కొలిపే ఆయుధమని అన్నారు. శ్రీ రామానుజుల వారు లోకకళ్యాణం కోసం రహస్య మంత్రాలను గోపురం ఎక్కి అందరికీ ప్రకటించారని, ఆయనే తొలి ‘ఆర్టీఐ’ కార్యకర్త అని పేర్కొన్నారు. తన బాల్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొని చదువుకున్న అనుభవాలను ఆయన పంచుకున్నారు.
అహంకారం నుంచి విముక్తినిచ్చేదే జ్ఞానం: గోరటి వెంకన్న
తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవడమే నిజమైన జ్ఞానమని ప్రముఖ కవి గోరటి వెంకన్న అన్నారు. జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతాలు తనలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయని తెలిపారు. పుస్తకం మనిషిని అహంకారం నుంచి విముక్తుడిని చేసి వినమ్రతను నేర్పుతుందని, తన పాటల్లో పల్లె జీవనం ప్రతిబింబించడానికి పఠనాసక్తియే కారణమని వివరించారు.

Comments
Post a Comment