గిరి ప్రదక్షిణ.. గోవింద నామస్మరణ!
రాంపల్లిదాయరలో వైభవంగా శ్రీహేమాద్రి వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ
తూఫాన్, కీసర :- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర వెంకులోని గుట్టపై కొలువైన శ్రీహేమాద్రి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం కనులపండువగా సాగింది. నిజ జ్యేష్ట పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.
గోవింద నామస్మరణలతో మారుమోగిన గుట్ట
గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ అర్చకులు శ్రీహేమాద్రి వెంకటేశ్వర స్వామి వారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల భజనలు, కీర్తనల నడుమ పల్లకి సేవ వైభవంగా ముందుకు సాగింది. భక్తులు 'గోవిందా.. గోవిందా..' అంటూ నామస్మరణలు చేస్తూ స్వామివారి పల్లకి వెంట నడుస్తూ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు ఆలయ కమిటీ తరఫున ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ, పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



Comments
Post a Comment