ఐటీ కారిడార్‌లో గ్లోబల్ టచ్.. అమెరికా కాన్సులేట్ రోడ్డు ఇకపై 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'

- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీల్లో కార్పొరేట్ దిగ్గజాల పేర్లతో రహదారులు, కూడళ్లు  

- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్.. రతన్ టాటా పేరుతో మౌలిక వసతులు  

- హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం



తూఫాన్, హైదరాబాద్ :- విశ్వనగరం హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిని, గ్లోబల్ గుర్తింపును మరింత పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ప్రముఖ రహదారులు, ప్రధాన కూడళ్లకు ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ ప్రముఖుల పేర్లు పెట్టాలని సంకల్పించింది. ఇందులో భాగంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (యూఎస్ కాన్సులేట్) పక్కన ఉన్న ప్రధాన రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

హైదరాబాద్ నగరం గ్లోబల్ ప్రొఫైల్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోనే ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ నామకరణ నిర్ణయానికి సంబంధించిన వివరాలను దౌత్య అధికారులకు అధికారికంగా నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ప్రముఖ సంస్థల పేర్లతో వీధులు:

ట్రంప్ అవెన్యూతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ పరిసరాల్లోని ఇతర కీలక రహదారులు, జంక్షన్లకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల పేర్లు పెట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లో 'గూగుల్ స్ట్రీట్', 'మైక్రోసాఫ్ట్ రోడ్', 'విప్రో జంక్షన్' పేరుతో సరికొత్త నామఫలకాలు దర్శనమివ్వనున్నాయి.  

రతన్ టాటాకు అరుదైన గౌరవం:

భారత పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసి, దేశ పురోగతిలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ పారిశ్రామికవేత్త, దివంగత రతన్ టాటా స్మృత్యర్థం నగరంలోని ప్రతిష్టాత్మక ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంతో పాటు, హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల హబ్‌గా నిలబెట్టే వ్యూహంలో భాగంగానే ఈ తరహా నామకరణాలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  

 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!