ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం

- ప్రభుత్వ బడుల 27 లక్షల మంది విద్యార్థులకు అంకితం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం

- రైతు బిడ్డలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం 




తూఫాన్, హైదరాబాద్ :- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఆదర్శ పాఠశాల ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.


ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించేలా ఈ పాఠశాలను సకల వసతులతో తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం పాఠశాల ఆవరణ అంతా తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఇదే వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం ‘బ్రేక్‌ఫాస్ట్’ (అల్పాహారం) పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటిస్తూ అల్పాహారం తీసుకున్నారు.

వంటగదిలో పూరీలు చేసిన సీఎం


పాఠశాలలోని అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, అధునాతన లైబ్రరీని సీఎం రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ సైన్స్ ల్యాబరేటరీల్లోని పరికరాలను, విద్యార్థుల ఉచిత రవాణా కోసం ఏర్పాటు చేసిన బస్సులను చూశారు. నృత్య, సంగీత బోధన గదులను సందర్శించిన అనంతరం వంటగదికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడి, స్వయంగా పూరీలు వత్తడంలో వారికి సహకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీచర్లు, పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులతో సమావేశమై విద్యా ప్రమాణాలపై పలు సూచనలు చేశారు.

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆట


క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను పరిశీలిస్తూ.. స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మైదానాలను, ఇండోర్ టెన్నిస్, క్యారమ్స్ హాళ్లను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా మైదానంలో విద్యార్థులతో కలిసి కొద్దిసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడి ఉత్సాహపరిచారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటిన సీఎం.. తమకు ఘన స్వాగతం పలికిన వందలాది మంది విద్యార్థులకు కరచాలనం చేస్తూ ఆశీస్సులు అందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు


ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!