రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు బండారు దత్తాత్రేయ వినతి

 

తూఫాన్, హైదరాబాద్‌: తెలంగాణలోని గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలపై ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయ సమస్యల పరిష్కారం, 1/70 చట్టం సమర్థవంతమైన అమలు, పెసా (PESA) చట్టం అమలు వంటి అంశాలను గవర్నర్ దృష్టికి దత్తాత్రేయ తీసుకువెళ్లారు. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులందరికీ హక్కులు కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కోరారు.

గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూ ఆక్రమణలు నిరోధించడానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఉపాధి కొరత తీర్చడానికి రాష్ట్ర గిరిజన సలహా మండలి (Tribal Advisory Council) ద్వారా తగిన చర్యలు చేపట్టాలని దత్తాత్రేయ కోరారు. గిరిజన సమాజ అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ఈ అంశాలపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సానుకూలంగా స్పందించారు. గిరిజనుల సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సాధ్యమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!