విద్యా రంగంలో సరికొత్త విప్లవం: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’

- ఆరుట్లలో తొలి పాఠశాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి


- కార్పొరేట్ స్థాయి వసతులతో నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య


- పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు స్కూళ్లు.. దశలవారీగా వందకు పెంపు



తూఫాన్, హైదరాబాద్ :- రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ (టీపీఎస్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరుట్లలో నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసింది.


అత్యాధునిక వసతులు.. ఇంగ్లీష్ మాధ్యమం:


ఈ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన సాగనుంది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అత్యాధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, విశాలమైన లైబ్రరీలతో పాటు క్రీడా మైదానాలను ఇక్కడ అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు పౌష్టికాహారానికి పెద్దపీట వేశారు. రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేలా ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు.

దశలవారీగా వంద స్కూళ్లు:


మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నాలుగు స్కూళ్లలో లభించే ఫలితాలు, క్షేత్రస్థాయి అనుభవాలను అధ్యయనం చేసిన అనంతరం, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ విద్యా రంగంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతూ, సరికొత్త అధ్యాయానికి ఈ టీపీఎస్ స్కూళ్లు నాంది పలుకుతాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!