సేవా దృక్పథంతోనే నిజమైన ఆనందం: బండారు దత్తాత్రేయ
- చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
తూఫాన్, హైదరాబాద్ :- "జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించుకోవడం కంటే, సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడం ద్వారానే గొప్ప ఆనందం, తృప్తి లభిస్తాయి" అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన నగరంలో పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తన మనవరాళ్లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు. తెలంగాణ సమాజం శాంతి, సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లాలని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, దేవాలయ ఈవో సుశీల్ రెడ్డి పాల్గొన్నారు.
రోగులకు పండ్ల పంపిణీ:
అనంతరం నల్లకుంటలోని ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిని దత్తాత్రేయ సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పండ్లు పంపిణీ చేస్తూ.. అనారోగ్య సమయాల్లో ధైర్యం, మనోబలం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలో మానవతా విలువలు పెంపొందాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎమ్‌ఓ రామాంజనేయులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.



Comments
Post a Comment