హైదరాబాద్ యువతి లడాఖ్ బైక్ యాత్ర: బండారు దత్తాత్రేయ అభినందనలు
తూఫాన్, హైదరాబాద్ :- నగరానికి చెందిన యువతి మెట్టు భాంధవి చేపట్టిన సాహసోపేత లడాఖ్ బైక్ యాత్ర గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి లడాఖ్ వరకు సాగే ఈ మోటార్‌సైకిల్ యాత్రను ఉద్దేశించి హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భాంధవి సంకల్ప బలాన్ని అభినందిస్తూ.. ఈ యాత్ర దిగ్విజయం కావాలని ఆయన ఆకాంక్షించారు.
అరోరా వర్సిటీ విద్యార్థిని సాహసం
ముషీరాబాద్‌లోని కలాధర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెట్టు వాసు, పద్మావతి దంపతుల కుమార్తె అయిన భాంధవి, ప్రస్తుతం అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్‌పై ఉన్న ఆసక్తితో తన కలల యాత్రకు శ్రీకారం చుట్టింది. ‘బైక్ అండ్ టూరింగ్ కంపెనీ’, ‘మ్యాడ్ ఓవర్ లడాఖ్’ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పర్యటనలో మొత్తం 10 మంది రైడర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్ బృందం నుంచి భాంధవితో పాటు సుప్రియా, కార్తీక్, కైవల్య, మౌనిక, నవ్య, పల్లవి తదితరులు ఈ సాహస యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ చేరుకోనుంది.
యువతులకు ఆదర్శం: దత్తాత్రేయ
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. నేటి యువత కలలు కనడమే కాకుండా వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన పర్వత మార్గాలు ఉండే లడాఖ్‌కు బైక్ యాత్ర చేపట్టడం భాంధవి పట్టుదలకు నిదర్శనమన్నారు. ఈ సాహస యాత్ర యువతలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని, ముఖ్యంగా మహిళలు ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందుకు సాగగలరనే బలమైన సందేశాన్ని సమాజానికి ఇస్తుందని పేర్కొన్నారు. కూతురి ఆశయానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు వాసు, పద్మావతిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కుటుంబ ప్రోత్సాహమే యువత విజయాలకు బలమైన పునాది అని, భాంధవి సురక్షితంగా యాత్ర పూర్తి చేసుకుని రావాలని ఆశీర్వదించారు.


.jpeg)

Comments
Post a Comment