జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాంనగర్‌లో కుటుంబ వివరాల నమోదు.. స్వీయ గణనలో పాల్గొన్న దత్తాత్రేయ
తూఫాన్,హైదరాబాద్:- దేశ భవిష్యత్తు ప్రణాళికలకు, సుపరిపాలనకు ప్రాతిపదికగా నిలిచే 2027 జనగణన ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్‌లోని తన నివాసంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) దశను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, ఈఆర్ఓ ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందానికి తన వివరాలను నమోదు చేయించారు.
అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి
అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ జనాభా, ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు జనగణన అత్యంత కీలకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. "వనరుల సమాన పంపిణీకి, అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరడానికి ఖచ్చితమైన గణాంకాలు అవసరం. అందుకే తెలంగాణ ప్రజలందరూ జనగణన అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి, సరైన సమాచారాన్ని అందించాలి" అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు, ఇతర గణన అధికారులు పాల్గొన్నారు.


Comments
Post a Comment