మీడియా వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పెంచాలి - మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మీడియా వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పెంచాలి
మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
TOOFAN - MEDCHAL
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరం లో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, 252 జి ఓను అనుసరించి నిబంధనలు పాటించాలని అన్నారు. అక్రిడిటేషన్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చూడాలని నియమ నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించి ముందుకు వెళ్లాలని సూచించారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఎవరైనా అక్రిడిటేషన్ కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంతకుముందు కమిటీ సభ్యులు అక్రిడిటేషన్ ప్రక్రియ గురించి తమ అనుభవాలను పంచుకొని, ఈ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగే విధంగా పలు సూచనలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సభ్యులు మోతె వెంకట్ రెడ్డి, గడ్డమీది బాలరాజు, రవిచందర్, రామారావు, ప్రసాద్, భూపాల్,అబ్దుల్ సామీ, మహాముద్, డిపిఆర్వో స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment