చీర్యాల నారసింహుడి చెంతకు పదండి.. నేటి నుంచే ‘అష్టాదశ’ బ్రహ్మోత్సవాలు!
చీర్యాల నారసింహుడి చెంతకు పదండి.. నేటి నుంచే ‘అష్టాదశ’ బ్రహ్మోత్సవాలు! ఏప్రిల్ 12 నుండి 15 వరకు కనుల పండువగా వేడుకలు.. 14న స్వామివారి తిరుకళ్యాణంభక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, నిత్య అన్నదానం.. ఆహ్వాన పత్రాలు అందుకున్న ప్రముఖులు
కీసర / మేడ్చల్ (తూఫాన్ బ్యూరో): ఆధ్యాత్మిక పరిమళాలతో కీసర మండలం చీర్యాల గ్రామం పులకించబోతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుండి 15 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గారు భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల ప్రత్యేక షెడ్యూల్ ఇదే:
ఏప్రిల్ 12 (ఆదివారం): సాయంత్రం 5 గంటలకు చైర్మన్ లక్ష్మీనారాయణ నివాసం నుండి గ్రామమంతా స్వామివారి భవ్య ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం.
ఏప్రిల్ 13 (సోమవారం): పంచామృత అభిషేకం, సుదర్శన నరసింహ యాగం, అఖండ జ్యోతి స్థాపన వంటి విశేష పూజలు.
ఏప్రిల్ 14 (మంగళవారం): ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట రిటైర్డ్ ప్రధానార్చకులు నృసింహ చార్యుల పర్యవేక్షణలో ‘స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం’.
ఏప్రిల్ 15 (బుధవారం): చక్రస్నానం, మహాపూర్ణాహుతితో బ్రహ్మోత్సవాల ముగింపు.
భక్తులకు కొంగు బంగారు సౌకర్యాలు:
ఆర్టీసీ స్పెషల్ బస్సులు: సికింద్రాబాద్ స్టేషన్ నుండి చీర్యాల టెంపుల్ వరకు 241J నంబర్ బస్సు రోజుకు 6 ట్రిప్పులు నడపనున్నారు.
అన్నదానం: మూడు రోజుల పాటు మూడు పూటల నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది.
వైద్య సేవలు: కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, సోలిస్ హాస్పిటల్ తరఫున ఉచిత మజ్జిగ పంపిణీ, చలువ పందిర్లు ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక శోభ: ప్రతి రోజు సాయంత్రం భక్తులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రముఖులకు ఆహ్వానం:
ఈ బ్రహ్మోత్సవాలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, ఎంపీలు ఈటల రాజేందర్, వేం నరేందర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి వంటి రాజకీయ, అధికార ప్రముఖులను చైర్మన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు.


Comments
Post a Comment