జాతీయ స్థాయిలో వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీ కైవసం చేసుకున్న తెలంగాణ పోలీస్
జాతీయ స్థాయిలో వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీ కైవసం చేసుకున్న తెలంగాణ పోలీస్ - విజేతలను అభినందించిన డిజిపి బి. శివధర్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 3 (తూఫాన్): అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీస్ విభాగం సరికొత్త చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం, వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకుని అద్భుతమైన హ్యాట్రిక్ సాధించింది. ఈ సందర్భంగా విజేతలను, వారికి శిక్షణ నిచ్చిన అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర పోలీస్ విభాగం సాధించిన ఈ ఘనత తెలంగాణ కీర్తికిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుందని, అధికారుల అంకితభావం, క్రమశిక్షణే ఈ విజయానికి పునాదులని ఆయన ప్రశంసించారు. సిఐడి విభాగం ప్రత్యక్ష పర్యవేక్షణలో, నిరంతర శిక్షణతో రాటుదేలిన రాష్ట్ర బృందాలు ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. 2023-24లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2024-25లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లోనూ విజేతగా నిలిచిన తెలంగాణ, తాజాగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన 69వ డ్యూటీ మీట్‌లోనూ అదే జోరును కొనసాగించి వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయం రాష్ట్ర పోలీసుల వృత్తి నైపుణ్యానికి, సన్నద్ధతకు మరియు క్షేత్రస్థాయిలో వారు కనబరుస్తున్న పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందని డిజిపి ప్రశంసించారు. నాగ్‌పూర్ పోటీల్లో వివిధ విభాగాల్లో తెలంగాణ బృందం తన ఆధిపత్యాన్ని చాటుకుందన్నారు. ముఖ్యంగా అత్యంత క్లిష్టమైన యాంటీ సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ మరియు కంప్యూటర్ అవేర్‌నెస్ పోటీల్లో రాష్ట్ర పోలీసులు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారని కొనియాడారు. వీటితో పాటు సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లోనూ ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీలను గెలుచుకున్నారన్నారు. అత్యాధునిక సాంకేతికతను నేర పరిశోధనలో వినియోగించడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయనీ,
శాస్త్రీయ నేర పరిశోధన, వినూత్న పద్ధతుల అవలంబన మరియు నిరంతర సామర్థ్య పెంపుదల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ చూపుతున్న నిబద్ధతకు ఈ జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని భావిస్తున్నారు. ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు, సమర్థవంతమైన చట్ట అమలుకు ఈ తరహా వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంతగానో దోహదపడతాయని డిజిపి బి.శివధర్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 6 బంగారు, 3 వెండి, 3 కాంస్య పతకాలు గెలుచుకున్న సందర్భంగా సిఐడి అడిషనల్ డీజీపీ చారు సిన్హా ను, ప్రధాన కోచ్ లు డి. ప్రతాప్( అదనపు ఎస్పీ టీజీ జెన్‌కో), ఎం. రామకృష్ణ (కమాండెంట్ 8వ బెటాలియన్), టీమ్ మేనేజర్ కె. ప్రసాద్ (ఎస్పీ సీఐడీ) లను, విజేతలను డీజీపీ అభినందించారు .

Comments
Post a Comment