హెచ్.జే. దొర మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం

- మాజీ డీజీపీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హర్యానా మాజీ గవర్నర్ 



తూఫాన్,హైదరాబాద్ :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ హెచ్.జే. దొర మరణం పట్ల హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దొర మృతి పోలీస్ శాఖకు, సమాజానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దొరతో తనకున్న దశాబ్దాల కాలం నాటి అనుబంధాన్ని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు.

తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను దత్తాత్రేయ వివరించారు. 1999-2000 ప్రాంతంలో తాను ప్రతిరోజూ ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్‌కు వెళ్లేవాడినని, అయితే ఒకరోజు అప్పటి డీజీపీ దొర ఫోన్ చేసి యూనివర్సిటీకి వెళ్లవద్దని వారించారని చెప్పారు. అనంతరం వచ్చిన పోలీస్ అధికారులు తన నివాసం ఉండే రాంనగర్, ఓయూ పరిసరాల్లో నక్సలైట్ల కదలికలు ఉన్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా వాకింగ్ ప్రదేశాన్ని మార్చుకోవాలని సూచించారని తెలిపారు. విధి నిర్వహణలో ఆయనకు ఉన్న అప్రమత్తతకు ఇది నిదర్శనమని కొనియాడారు.



బీజేపీ నేత నందరాజు గౌడ్ హత్య ఉగ్రవాద చర్య కాదని, పార్టీ అంతర్గత విభేదాల వల్లే జరిగిందని కొందరు ఆరోపించినప్పుడు.. దొర వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించారని దత్తాత్రేయ గుర్తు చేశారు. ఆ విచారణ ద్వారానే అది ఉగ్రవాదుల పనేనని నిజానిజాలు బయటపడ్డాయని చెప్పారు.

డీసీపీగా, సిటీ కమిషనర్‌గా, రాష్ట్ర డీజీపీగా దొర అందించిన సేవలు చిరస్మరణీయమని దత్తాత్రేయ అన్నారు. వృత్తి పట్ల నిబద్ధత, బాధ్యతాయుతమైన పనితీరు ఆయన గొప్పతనమని పేర్కొన్నారు. దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.




Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!