భారతీయ మూలాలను మరువద్దు: వెంకయ్య నాయుడు
- భారతీయ మూలాలను మరువద్దు: వెంకయ్య నాయుడు
తూఫాన్, హైదరాబాద్ :- "భారతీయ నాగరికతలో కళలు కేవలం వినోద సాధనాలు కావు.. అవి మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే సోపానాలు" అని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. శనివారం హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'నాదోపాసన' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాదాన్ని బ్రహ్మగా భావించే గొప్ప సంస్కృతి మనదని, సంగీతం ద్వారా దైవానికి దగ్గరవ్వడమే నిజమైన నాదోపాసన అని ఆయన అభివర్ణించారు.
ఆలయాలు సంస్కృతీ నిలయాలు కావాలి
ఒకప్పుడు గ్రామాల్లోని దేవాలయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కాదని.. విద్య, శిల్పం, సంగీతం, సాహిత్యం పరిమళించే విశ్వవిద్యాలయాలని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. నేడు మళ్ళీ ఆ వైభవం రావాలని, ఆలయాలను భారతీయ సంస్కృతీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి సాయంత్రం దేవాలయాల్లో సత్సంగాలు, హరికథలు, పురాణ కాలక్షేపం వంటి సంప్రదాయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా ప్రతిరోజూ అన్నమయ్య కీర్తనలు వింటూనే రోజును ప్రారంభిస్తానని, ఒత్తిడితో కూడిన నేటి జీవనశైలికి శాస్త్రీయ సంగీతం ఒక అద్భుత ఔషధమని పేర్కొన్నారు.
యువతకు సూచన - కళాకారులకు అభినందన
"ఆధునికతను ఆహ్వానించండి.. సాంకేతికతను అందిపుచ్చుకోండి.. కానీ మీ మూలాలను మాత్రం మర్చిపోకండి" అని యువతకు సూచించారు. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా దాని దారం నేల మీదే ఉండాలని, అలాగే విద్యార్థులు ఎక్కడ ఉన్నా భారతీయతను గుండెల్లో దాచుకోవాలని కోరారు. కర్ణాటక సంగీత విద్వాంసులు మల్లాడి సోదరులు (మల్లాడి శ్రీరామ్ ప్రసాద్, మల్లాడి రవికుమార్) సంగీత వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్న తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని వాగ్దేవి కళా సమితి చేపట్టిన సంస్కృతీ పరిరక్షణ యజ్ఞాన్ని కొనియాడుతూ.. వచ్చే ఏడాది అయోధ్య, రామేశ్వరం వంటి ప్రాంతాలకు ఈ కార్యక్రమాలను విస్తరించాలన్న వారి సంకల్పాన్ని అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం ఏదో ఒక భారతీయ కళ వైపు ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


Comments
Post a Comment