మున్సిపల్ పీఠమే లక్ష్యం.. శ్రేణులకు ఈటల దిశానిర్దేశం

ముడుచింతలపల్లిలో బీజేపీ ఎన్నికల సమరశంఖం.. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుకు పిలుపు


తూఫాన్,హైదరాబాద్ :- మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. మంగళవారం సాయంత్రం ముడుచింతలపల్లి మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో కీలక ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ హాజరై అభ్యర్థులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని వారు పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సర్కార్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలకు అవగాహన కల్పించారు.


ఈ సమావేశంలో బీజేపీ నేతలు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి, పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు మరియు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!