ముగిసిన ఖేల్ మహోత్సవం.. విజేతలకు బహుమతుల ప్రదానం
- జింఖానాలో క్రీడా సంబరాలు.. హాజరైన విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి
తూఫాన్,హైదరాబాద్ :- సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన 'పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం' మెగా క్రీడా పండుగ ఆదివారం ఘనంగా ముగిసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ముగింపు వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ ఖేల్ మహోత్సవం అద్భుతమైన వేదికగా నిలిచిందని కొనియాడారు. గల్లీ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఈ పోటీలు ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు కూడా తోడ్పడతాయని, క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో వేలాది మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఎమ్మెల్సీ కొమరయ్య, అంజి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.


Comments
Post a Comment