సంజీవయ్య ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం
- నేక్లెస్ రోడ్డులో మాజీ ముఖ్యమంత్రికి బండారు దత్తాత్రేయ ఘన నివాళి
తూఫాన్,హైదరాబాద్ :- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కార్మిక పక్షపాతి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో ఉన్న ఆయన మెమోరియల్ వద్ద హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులు అర్పించారు. సాధారణ కుటుంబంలో జన్మించి, నీతి, నిజాయితీ, స్వయంకృషితో అత్యున్నత పదవులను అధిరోహించిన సంజీవయ్య జీవితం నేటి యువతకు ఆదర్శమని దత్తాత్రేయ కొనియాడారు.
అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించారని గుర్తుచేశారు. భూసంస్కరణల అమలులో, వెనుకబడిన వర్గాల అభివృద్ధిలో ఆయన ముద్ర చెరిపివేయలేనిదని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా దత్తాత్రేయ స్మరించుకున్నారు. సంజీవయ్య అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన విలువలను కాపాడుకోవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.


Comments
Post a Comment