మాస్టర్ ప్లాన్ జోన్లతో రైతులకు అన్యాయం: బండారు దత్తాత్రేయ

 - కోహెడలో బాధిత రైతులతో ముఖాముఖి 

- ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ


తూఫాన్(తుర్కయంజాల్) :- హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగ జోన్ల వర్గీకరణ కారణంగా సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బడా బాబులకే మేలు.. రైతులకు కీడు!

అనంతరం జరిగిన సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా ఉందన్నారు. "పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములను రెసిడెన్షియల్ (నివాస) జోన్లుగా మారుస్తూ, పేద రైతుల భూములను మాత్రం కన్జర్వేషన్ (రక్షణ) జోన్లుగా ఉంచడం ఏ రకమైన న్యాయం?" అని ఆయన ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ (ORR) లోపల ఉన్న రైతుల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్ జోన్ కిందకు మార్చాలని డిమాండ్ చేశారు. రైతులు తమ సొంత భూమిలో ఇల్లు కట్టుకోవాలన్నా నిబంధనలు అడ్డంకిగా మారడం శోచనీయమన్నారు.

ముఖ్యమంత్రితో చర్చిస్తా..

రైతుల సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోహెడను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేసి ఎల్బీనగర్ జోన్‌లో కలపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతు నాయకులు, అఖిలపక్ష ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.







Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!