స్థానిక నిధుల ఆడిట్ (ఎల్ఎఫ్ఏ) డైరెక్టరేట్లు, రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం మూడు రోజుల జాతీయ వర్క్‌షాప్
స్థానిక నిధుల ఆడిట్ (ఎల్ఎఫ్ఏ) డైరెక్టరేట్లు, రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం మూడు రోజుల జాతీయ వర్క్‌షాప్
హైదరాబాద్, 2026 జనవరి 21(TOOFAN): సంస్థాగత యంత్రాంగాన్నీ, వృత్తిపరమైన సమర్థతనూ, స్థానిక ప్రభుత్వాలకు బాధ్యత వహించే ప్రాథమిక ఆడిటింగ్ సంస్థల (పీఏఐ) ఆడిట్ పద్ధతులనూ బలోపేతం చేయడం లక్ష్యంగా - స్థానిక నిధుల ఆడిట్ డైరెక్టరేట్లు (డీఎల్ఎఫ్ఏ), రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం.. గ్రామీణాభివృద్ధి అంతర్గత ఆడిట్ కేంద్రం (సీఐఏఆర్డీ), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించాయి. అంతర్జాతీయ స్థానిక సంస్థల ఆడిట్ కేంద్రం (ఐసీఏఎల్) సహకారంతో 2026 జనవరి 19 నుంచి 21 వరకు ఈ సంస్థలు వర్క్‌షాప్ ను నిర్వహించాయి.
ముగింపు సమావేశానికి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ సంజయ మూర్తి, ఎన్ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి. నరేంద్ర కుమార్, డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ మనీశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహానీ హాజరయ్యారు. ఐసీఏఎల్ డైరెక్టర్ జనరల్ శ్రీ హెచ్.కె. ధర్మదర్శి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23 రాష్ట్రాల డీఎల్‌ఎఫ్‌ఏలు, రాష్ట్ర ఆడిట్ విభాగాలు, ఈఎల్‌ఎఫ్‌ఏలకు చెందిన 41 మంది అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరళ్లూ, అకౌంటెంట్ జనరళ్లూ ఈ వర్క్‌షాపులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వర్క్‌షాప్ డైరెక్టర్ డాక్టర్ యు. హేమంత కుమార్ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. స్థానిక నిధుల ఆడిటింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, పీఏఐ పరిణతిని అంచనా వేయడం, కాగ్ సాంకేతిక మార్గనిర్దేశమూ - సహకార యంత్రాంగం వంటి అంశాలపై చర్చలు జరిగాయని ఆయన వివరించారు. వీటితోపాటు ఆడిట్ ప్రణాళిక, రిపోర్టింగ్, స్థానిక సంస్థలతో సమన్వయం వంటి అంశాల్లో అనుభవాలను పంచుకోవడంపై ఈ వర్క్‌షాప్ ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల స్థానిక నిధుల ఆడిట్ డైరెక్టర్లు ఐదు ప్రధాన అంశాలపై బృందాలుగా చర్చించారు. ఇందులో పీఏఐ పరిణతి, వర్చువల్ ఆడిట్ విధానం, గ్రామ పంచాయతీల రిమోట్ ఆడిట్, తనిఖీ నివేదికలూ, ఆడిట్ ప్రణాళికల ప్రామాణీకరణ వంటి అంశాలున్నాయి. అలాగే ఐటీ, కృత్రిమ మేధ, కాట్స్ సాధనాలను ఉపయోగించి టీజీఎస్‌ను బలోపేతం చేయడంపైనా వారు చర్చించారు. స్థానిక సంస్థల పాలనలో ఆడిట్ పరిధినీ, నాణ్యతనూ, పారదర్శకతనూ పెంపొందించడంలో.. సరళీకృత, ప్రామాణిక ఆడిట్ వ్యవస్థల ఆవశ్యకతను ఈ బృంద చర్చలు స్పష్టం చేశాయి. అలాగే సాంకేతికత సాయంతో రిమోట్ ఆడిట్ విధానాలను అవలంభించడంతోపాటు.. ఆడిట్ అనంతర చర్యలనూ, నిబంధనల అమలు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సూచించాయి. క్షేత్రస్థాయిలో డీఎల్ఎఫ్ఏల సామర్థ్యాన్ని పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నాయి.
సదస్సులో పాల్గొన్న వారితో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంభాషించారు. వివిధ బృందాలు సమర్పించిన ప్రజెంటేషన్లను అభినందించిన ఆయన.. పలు రాష్ట్రాలు లేవనెత్తిన సవాళ్లనూ, వారు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తగిన చర్యలు తీసుకోవడంతోపాటు వ్యవస్థాగత మెరుగుదల కోసం.. త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల కార్యదర్శుల వర్క్‌షాప్‌లో వీటిని ప్రదర్శిస్తామని తెలిపారు.
ఎన్ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ ముగింపు ఉపన్యాసంతో ఈ వర్క్‌షాప్ ముగిసింది. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను సత్కరించారు.

Comments
Post a Comment