సైదాబాద్‌లో వైభవంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు
ఎనిమిదో రోజుకు చేరిన మహోత్సవాలు.. భక్తిపారవశ్యంలో టీన్ మంజిల్ కాలనీ
తూఫాన్,హైదరాబాద్ :- టీన్ మంజిల్ కాలనీలోని దుర్గామాతా మందిరం వేదికగా జరుగుతున్న శ్రీ రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఈ మహా యాగంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున గోపూజ, ప్రాతఃకాల అర్చనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం గణపతి, లక్ష్మీ గణపతి హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం భవానీశంకర స్వామికి, అమ్మవారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. సాయంత్రం రాజశ్యామల అమ్మవారి మూల మంత్ర జపం, హోమం, రుద్రా సహిత మండప దేవత హోమాలు నిర్వహించనున్నారు. ప్రదోషకాల అర్చన, లలితా సహస్రనామ కుంకుమార్చనలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.
అనురాగ్ శర్మ, సాయిరాం శర్మ, పవన్ శర్మ, సాయి ప్రణవ్ శర్మ, దివాకర్ శర్మల మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత క్రమశిక్షణతో జరుగుతున్నాయి. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు తరలివస్తుండటంతో సైదాబాద్ పరిసర ప్రాంతాలన్నీ భక్తి సాగరంలో మునిగిపోయాయి. రేపు (బుధవారం) మహాపూర్ణాహుతితో ఈ నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.



Comments
Post a Comment