హైదరాబాద్‌లో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనం
హైదరాబాద్‌లో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనం
బీసీల హక్కుల సాధనకై కలాలను పదునుపెట్టాలి‘జననాయక’, ‘కర్పూరీ ఠాకూర’ పుస్తకాల ఆవిష్కరణ సభలో బీసీ సాహితీవేత్తల ప్రతిజ్ఞ
ఎన్నెన్నో మహోద్యమాలకు పాదువేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ జలదృశ్యం ప్రదేశం నుంచి బీసీల ఉద్యమకొండ లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం సాక్షిగా బీసీ కవులు, రచయితలు, విద్యావేత్తలు బీసీల హక్కుల సాధన ఉద్యమానికి తమ కలాలను పదునెక్కిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హైదరాబాద్‌లో త్వరలో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనాన్ని నిర్వహించి బీసీ సాహిత్య, సాంస్క్రుతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని బీసీ సాహితీవేత్తలు నిర్ణయించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు సాహిత్య, సాంస్క్రుతికక రంగం క్రియాశీలక పాత్ర పోషించాలని తీర్మానించారు. కర్పూరీ ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై గల కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహంవద్ద శనివారం నాడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన “జననాయక” కర్పూరీ ఠాకూర్‌పై కవితా సంకలనం, “జన నాయక్ కర్పూరీ ఠాకూర”పై వ్యాససంకలనం రెండు పుస్తకాలను రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, లాల్‌నీల్ రూపకర్త, సామాజిక ఉద్యమకారుడు జి.రాములు ఆవిష్కరించారు.
బీసీలు ప్రత్యామ్నాయ శక్తిని సృష్టించాలి:- రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ బీసీల హక్కుల రిజర్వేషన్లు తొలిసారిగా అమలు చేయడం వల్లనే కర్పూరీ ఠాకూర్ పదవి కోల్పోవలసి వచ్చిందన్నారు. బీహార్ ప్రజల మనస్సుల్లో అట్టడుగు వర్గాల ప్రజల మదిలో కర్పూరీ మచ్చలేని నాయకుడిగా నిలిచిపోయారన్నారు. పదవికోసం తన ఆలోచనల్ని ఏనాడు మార్చుకోలేదన్నారు. తెలంగాణ సమ్పుాంలో ప్రత్యామ్నాయం కోసం బీసీలు, ప్రగతిశీలవాదులంతా ఏకంకావాలన్నారు. ఒక విధాన ప్రాతిపదికన పనిచేస్తే బీసీలందర్నీ ఏకంచేయవచ్చునన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు పిడికిళ్ళు బిగిస్తే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని సృష్టించవచ్చునన్నారు. బహుజనులంతా ఐక్యమైనప్ప్పుడే ప్రత్యామ్నాయానికి మంచి రూపువస్తుందని జస్టిస్ చంద్రకుమార్ విశ్లేషించారు.
బీసీల హక్కుల సాధనకై త్వరలో కవులు, రచయితల సమ్మేళనం:- జూలూరు గౌరీశంకర్
బీసీ కవులు, రచయితలు, కళాకారులు ముక్తకంఠంతో గర్జిస్తూ తమ హక్కుల కోసం సాగవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నో చారిత్రక మలుపులకు కేంద్రమైన జలదృశ్యం నుంచే కవులు, రచయితలు నేడు ప్రతిజ్ఞ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మహాసభకు సంబంధించిన కార్యాక్రమాలను, ఎన్నెన్నో అస్తిత్వ ఉద్యమాల చర్చలు జరిపిన ప్రదేశం, కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజినామచేసి తెలంగాణ అస్తిత్వ జెండా ఎత్తిన ప్రదేశం జలదశ్యం ప్రాంగణంలోనే బీసీ సాహితీవేత్తలు ప్రతిజ్ఞ చేయడం బీసీ సాహిత్య ఉద్యమానికి మలుపు అవుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో 33 జిల్లాల బీసీ కవులు, రచయితలతో మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తామని జూలూరు ప్రకటించారు.
కర్పూరీ స్ఫూర్తిగా కవులు కదలాలి:- సంగిశెట్టి శ్రీనివాస్
ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జన నాయకుడు కర్పూరీ ఠాకూర్ జ్ఞాపకంలో కవితాసంకలనం వెలువరించడం సంతోషకరమన్నారు. ఉత్తరాది బీసీ నాయకులు, లాలుప్రసాద్ యాదవ్, ములాయిం సింగ్‌లను ఆధిపత్య కులవ్యవస్థ అవినీతి నాయకులుగా ముద్రవేసి తప్ప్పుడు ప్రచారాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రథయాత్రను అడ్డుకున్నందువల్లనే లల్లూ, ములాయింలపై విషప్రచారం చేశారని తెలిపారు. దేశంలోని బీసీలందరూ ఒక్కటే అని తెలుగు సమాజం నినదిస్తుందని చెప్పారు. బీసీల అభ్యున్నతికోసం అహర్నిషలు కృషి చేయడమే కాకుండా నిజాయితీగా, నిఖార్సుగా ధిక్కార గొంతుక వినిపించిన కర్పూరీ ఠాకూర్ స్ఫూర్తిగా బీసీ కవులు, రచయితలు కదలడం రేపటి బహుజన ఉద్యమానికి ఊపిరి అవుతుందన్నారు. కర్పూరీ ఠాకూర్ సేవలను, సామాజిక మార్పు కోసం ఆయన చేసిన కృషిపై ఒక రోజంతా ప్రత్యేక సెమినార్‌ను బీసీ రచయితలు ఏర్పాటు చేయాలన్నారు.
బీసీయోధుల చరిత్రలను ఈ తరంకి చెప్పాలి:- జి.రాములు
లాల్‌నీల్ సృష్టికర్త, సామాజిక ఉద్యమకారుడు జి.రాములు మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుల చరిత్రను వెలికితీసేందుకు బీసీ కవులు, రచయితలు కీలకపాత్ర పోషించాలన్నారు. బుద్ధుడు, ఫూలే, కబీరు, వేమన, పెరియార్, పోతులూరి, నారాయణగురు, కర్పూరీ ఠాకూర్‌ల జీవితాలను కొత్తతరంకు తెలియజేయాల్సిన బాధ్యత బీసీ కవులు, రచయితలపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆడంబరాలు లేని అసమాన నేత :- వనపట్ల సుబ్బయ్య
ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య మాట్లాడుతూ బుద్ధుడి పుట్టిన నేలలో మంగళి కులంలో జన్మించిన ఠాకూర్ దేశంలో తొలిసారిగా బీసీ రిజర్వేషన్లను అమలు చేసారని తెలిపారు. ఆడంబరాలులేని సాధారణ జీవితం, అసమానతలులేని సమాజ స్థాపన కోసం కర్పూరీ జీవితాంతం కృషి చేసిన యోధుడని తెలిపారు.
బీసీ మహిళారిజర్వేషన్లకై పోరాటం:- జ్వలిత
ప్రఖ్యాత రచయిత జ్వలిత మాట్లాడుతూ మేమెంతో మాకంత నినాదంతో విరివిగా సాహిత్య సృష్టి జరగాలన్నారు. బోధించడం, సమీకరించటం ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. చట్టసభల్లో బీసీ మహిళలను రిజర్వేషన్లు ఇవ్వాలని తెలియజేశారు.
ఎంబీసీలంతా ఏకం కావాలి:- రాపోలు సుదర్శన్
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ కర్పూరీ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మంగళి కులం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కాని చట్టసభల్లోకి రాకపోవడం విచారకరం అన్నారు. ఎంబీసీలంతా ఏకంకావాలన్నారు. ప్రధాన పార్టీల ఎంబీసీలు సీట్లు సంపాదించి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎదగాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బీసీ రాజకీయ ఉద్యమానికి సాహితీవేత్తల దిశానిర్దేశం:- కటకం నర్సింహారావు
బీసీ ఆలోచనావేదిక వ్యవస్థాపకులు కటకం నర్సింహరావు మాట్లాడుతూ ఠాకూర్‌పై కవితాస్వరాలు తేవటం బీసీ భావజాల వ్యాప్తిలో కీలక మలుపు అన్నారు. బీసీ రాజకీయ ఉద్యమానికి బీసీ కవులు, రచయితలు, తమ భావజాలంతో దిశానిర్దేశం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జెల్లి సిద్ధయ్య, సాహిత్య విమర్శకుడు హెచ్.రమేష్‌బాబు, తెలంగాణ పబ్లికేషన్స్ అధినేత కోయ చంద్రమోహన్, రచయిత ఎదిరేపల్లి కాషన్న, అడ్వకేట్ అన్నభీమోజు నాగార్జునాచారి, కవులు, రచయితలు బాణాల శ్రీనివాస్, షహబాజ్, రామ్‌దాస్, గంధం బంగారు, జంపాల ప్రవీణ్, గింజల ర్యామ్, విశ్వకర్మల ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ వైస్ ఛైర్మన్ మధన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment