విద్యార్థులు లక్ష్య సాధనలో 'కలాం'ను స్ఫూర్తిగా తీసుకోవాలి: డాక్టర్ కె. లక్ష్మణ్
అశోక్ నగర్ లో పేద విద్యార్థులకు స్టడీ కిట్ల పంపిణీ
మాజీ కార్పొరేటర్ టి. శైలజ గోపాల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
ఉచిత ట్యూషన్ చెబుతున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం
తూఫాన్, హైదరాబాద్ :- కష్టపడి చదివి "నేను ఏదైనా సాధించగలను" అన్న ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందడుగు వేయాలని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో శనివారం పేద విద్యార్థులకు ఉచిత స్టడీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు టి.శైలజ గోపాల్ మరియు రేస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల కోసం వారికి అవసరమైన పుస్తకాలు, ప్యాడ్లు, స్టేషనరీతో కూడిన స్టడీ కిట్లను అందజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే శైలజ గోపాల్ వంటి నాయకులకు, రేస్ వంటి సంస్థలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు అబ్దుల్ కలాం, నరేంద్ర మోదీ వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా విద్యను వీడరాదని హితవు పలికారు మరియు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాజీ కార్పొరేటర్ శైలజ గోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.గోపాల్‌తో కలిసి విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. శైలజ గోపాల్ మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీల స్ఫూర్తితో నిత్యం ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ సేవ చేయడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండాగోని భరత్ గౌడ్, నాయకులు పూసా రాజు, రమేష్ రామ్, నవీన్ కుమార్, జైపాల్ రెడ్డి, పార్థసారధి, శ్రీకాంత్, సాయిచంద్, వాణీశ్వర శాస్త్రి, దోనేటి సత్యం, బంటి(లక్ష్మీనారాయణ), దోనేటి వనజ రాణి, అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



Comments
Post a Comment