ముక్కోటి వేళ.. 'గోవింద' నామస్మరణ
- ఉత్తర ద్వార గుండా వేంకటేశ్వరుడిని దర్శించుకున్న బండారు దత్తాత్రేయ
- చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవస్థానంలో భక్తుల కోలాహలం
తూఫాన్ - చిక్కడపల్లి (హైదరాబాద్) :- వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న దత్తాత్రేయకు అర్చకులు, దేవస్థాన కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ద్వారం) ద్వారా ఆయన స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు.
దర్శనం అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం శుభసూచకమని, తెలుగు ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఆయన కొనియాడారు. ఆలయ పరిసరాలన్నీ 'గోవింద.. గోవింద' నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.


Comments
Post a Comment