పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం - Crime News Chikkadpally Police Station Hyderabad


 పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం


పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రూ.90,800 కోల్పోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.


పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.... చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని మంగళ్య షాపింగ్ మాల్ వద్ద నివాసం ఉండే భాగమ్మ రజిత (35) అనే ప్రైవేట్ ఉద్యోగిని జూలై 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి సంబంధించిన పోస్ట్ చూశారు. ఆసక్తితో ఆమె వాట్సాప్ నంబర్ (9341843064) ద్వారా వారిని సంప్రదించారు. మొదట చిన్న చిన్న టాస్క్‌లు చేయించి, ప్రతిఫలంగా ఆమెకు రూ.10 క్రెడిట్ చేసి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత, నిందితులు ఆమెను **'నేషనల్ ఎక్స్ఛేంజ్' (National Exchange)** అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాలని సూచించారు.

ఆ గ్రూప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అడిగారు. దీంతో ఆమె జూలై 6న రూ.10,800 నుంచి మొదలుపెట్టి, పలు దఫాలుగా రూ.44,000, రూ.32,000, రూ.4,000 చొప్పున మొత్తం **రూ.90,800** వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. డబ్బులు తిరిగి వడ్డీతో సహా వస్తాయనే ఆశతో చెల్లించినా, నిందితులు మరింత డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆగస్టు 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ కేసులో ఏ1గా ఉన్న జ్యోతి అనే టెలిగ్రామ్ ఐడీ కలిగిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, దాని లింక్‌ను కాపీ చేసిన ఏ4 నిందితుడు మహ్మద్ జహంగీర్ అహ్మద్ టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాడు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపడంతో, ఏ4 తన ఫెడరల్ బ్యాంక్ ఖాతా, సిమ్ కార్డు వివరాలు ఇచ్చి రూ.20,000 కమీషన్ పొందాడు. అనంతరం, ఏ4 నిందితుడు తన మేనల్లుడు మహ్మద్ జహంగీర్ ఫాహ్మీ @ ఫరాజ్ (ఏ5)కు ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.9,000 ఇస్తానని చెప్పి ఒప్పించాడు. ఏ5, తన స్నేహితులైన మహ్మద్ అఫ్రోజ్ (ఏ6) మరియు సాజిద్ (ఏ7)లను కూడా ఈ మోసంలో భాగం చేశాడు. ఏ5 ద్వారా ఏ6, ఏ7ల బ్యాంకు ఖాతాలు, కొత్త సిమ్ కార్డులు సేకరించి, వాటి ద్వారా వచ్చే లావాదేవీలన్నీ ఏ4 నిర్వహించేవాడు. ఖాతాలు ఫ్రీజ్ అయిన వెంటనే సిమ్ కార్డులు, పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను పారవేసేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి డీఐ ఎం. శంకర్ నేతృత్వంలోని బృందం అక్టోబర్ 1న ఉదయం 11:30 గంటలకు మహ్మద్ జహంగీర్ అహ్మద్, మహ్మద్ జహంగీర్ ఫాహ్మీ @ ఫరాజ్, మహ్మద్ అఫ్రోజ్ లను అరెస్ట్ చేసి  న్యాయస్థానంలో హాజరుపరిచింది.ఈ కేసులో ప్రధాన నిందితులైన టెలిగ్రామ్ ఐడీ జ్యోతి, నాగండ్ల పూర్ణాచారి ,దినేష్ కుమార్, సాజిద్  లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి