గ్రామీణ డాక్ సేవకుల భారీ నిరసన.. దిగివచ్చిన అధికారులు
గ్రామీణ డాక్ సేవకుల భారీ నిరసన.. దిగివచ్చిన గ్రామీణ డాక్ సేవకుల భారీ నిరసన.. దిగివచ్చిన అధికారులు
భారత తపాలా శాఖకు చెందిన మూడు లక్షల మంది గ్రామీణ్ డాక్ సేవక్ లు దేశవ్యాప్తంగా గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో దేశంలోని లక్షా యాబై ఐదు వేల పోస్టాఫీసుల్లో లక్షా ముప్పై వేల పోస్టాఫీసులు మూతపడ్డాయి. నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగ భద్రత కోసమో, పని పరిస్థితుల మెరుగుదల కోసమో, సమాన పనికి సమాన వేతనం కోరుతూనో కూడ కాదు, కేవలం కమలేష్ చంద్ర కమిటీ నివేదికను పద్దెనిమిది నెలల తర్వాత అయినా బైటపెట్టమని, ఆ కమిటీ సిఫారసు చేసినట్టుగా తమ వేతనాలు పెంచమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన గ్రామీణ్ డాక్ సేవక్ లు ఇవాళ తమ సమ్మె పద్నాలుగో రోజు సందర్భంగా హైదరాబాద్ లోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి వచ్చి తమ సమస్య సత్వరమే పరిష్కరించాలని ఒక మెమొరాండం ఇవ్వాలని భావించారు. అధికారులు ఈ కార్మికులను పిఎంజి కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. అయితే వీరిలో నాలుగు వేల మంది కార్మికులను నాయకత్వం గాంధీ భవన్కి తీసికెళ్ళంది. సమ్మెకు పిలుపు ఇచ్చిన యూనియన్లలో కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి కూడ ఉంది గనుక గాంధీ భవన్ ఆవరణలో వాళ్లను అనుమతించారు.
అయితే కార్మికులంతా పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయాన్ని ముట్టడించాలనే సంకల్పం చేశారు. అంతే.. అనుకున్నదే తడవుగా గ్రామీణ డాక్ సేవకులు గాంధీ భవన్ నుంచి ఆబిడ్స్ దాకా కదం తొక్కారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, న్యాయం కావాలనే నినాదాలు మిన్ను ముట్టాయి. మొదట కొన్ని వందల మంది లోపలికి ప్రవేశించాక, ఇంకా వస్తున్న కార్మిక ప్రభంజనాన్ని చూసి అధికారులు పి ఎం జి కార్యాలయ గేట్లు మూసేశారు. గేటు ముందే కొద్దిసేపు ప్రదర్శన జరిపిన కార్మికులు అధికారుల, ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికన్నట్టు మొజంజాహి మార్కెట్ – ఆబిడ్స్ ప్రధాన రహదారిని అడ్డుకున్నారు. అటూఇటూ రోడ్డుకు అడ్డం పడ్డారు. దాదాపు గంట సేపు ట్రాఫిక్ జాం అయిన తర్వాత పిఎంజి కార్యాలయ గేట్లు తెరుచుకున్నాయి. కార్మికులందరినీ లోపలికి అనుమతించడం మాత్రమే కాదు, అధికారులు తమ చాంబర్ల నుంచి బైటికి వచ్చి కార్మికుల మెమొరాండం స్వీకరించారు.

Comments
Post a Comment