*మహిళా భద్రతలో హైదరాబాద్ ఆదర్శం - మేయర్ రామ్మోహన్*
*మహిళా భద్రతలో హైదరాబాద్ ఆదర్శం - మేయర్ రామ్మోహన్*
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో మహిళల భద్రతకు మరింత భరోసా ఏర్పడిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కమీషన్ ఆధ్వర్యంలో మహిళల చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మేయర్ రామ్మోహన్ హాజరయ్యారు. కమీషన్ ఛైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డిలతో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు, మహిళా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్, వేదింపుల నివారణకు హైదరాబాద్ నగరంలో షీ-టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. షీ-టీమ్‌ల ఏర్పాటుతో హైదరాబాద్‌లోని మహిళలో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని తెలుపుతూ ఈ షీ-టీమ్‌లను దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మహిళల హక్కులు, గౌరవాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తూ ఈ విషయంలో తగు సలహాలు, సూచనలు అందించాల్సిందిగా మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కమీషన్ ఛైర్మన్ టి.వెంకటరత్నం మాట్లాడుతూ వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని సూచించారు. ప్రతి గ్రామంలో 12మందితో మహిళల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక కమిటీలు కూడా గతంలోనే ఉన్నాయని, వీటిని సమర్థవంతంగా పనిచేయించాల్సిన అవసరం ఉందని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ అసమానత, వివక్షత అనేది అభివృద్ది చెందిన దేశాల్లోనూ సైతం ఉందని, దీనికి నిదర్శనం ఇప్పటి వరకు అభివృద్ది చెందిన దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ఒక మహిళ అద్యక్షురాలిగా కాకపోవడం నిదర్శనమని అన్నారు. చట్టాలను సంపూర్ణంగా తెసులుకున్నప్పుడే మహిళలు తమ హక్కులను సాధించుకోగలుగుతారని అన్నారు. షీ-టీమ్‌ల ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని, హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత, సౌకర్యాల పెంపుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఈవ్ టీజింగ్ ఇతర వేదింపులను అదిగమించడానికి ప్రతి ఐదుగురు విద్యార్థినుచే కమిటీలను ఏర్పాటు చేయాలని జనార్థన్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, చట్టాలపై చైతన్య లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, మహిళా అధికారిణులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments
Post a Comment