వేగంగా సికింద్రాబాద్ ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు
Turn off for: Telugu
*వేగంగా సికింద్రాబాద్ ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు*
*నగరంలో 10ఫ్లైఓవర్ల బ్యూటిఫికేషన్*
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లను మరింత ఆకర్షనీయంగా, ఆహ్లాదకరంగా రూపొందించేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా సికింద్రాబాద్ ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ను మరింత ఆకర్షనీయంగా ఉంచేందుకు రంగురంగుల పెయింటింగ్‌లను వేయించడం, గ్రీనరిని ఏర్పాటు చేయడం, ఆకట్టుకునేలా ఉండేలా ఎల్.ఇ.డి లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుగాను దాదాపు కోటిన్నర రూపాయలను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా కేటాయించింది. సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్ రోడ్డులోని ఫ్లైఓవర్‌కు రేలింగ్ ఏర్పాటు, మరమ్మతులు, పెయింటింగ్‌లను చేపట్టడానికి రూ. 1.06కోట్ల వ్యయంతో పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫ్లైఓవర్ క్రింద రంగురంగుల పూలతో కూడిన గార్డెనింగ్, ఫ్లైఓవర్ పిల్లర్లకు వర్టికల్ గార్డెన్‌లను రూ. 9లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు ఆకర్షనీయమైన లైటింగ్ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ల సుందరీకరణ పనులను నార్త్ జోన్ కమిషనర్ జె.శంకరయ్య తనిఖీ చేశారు. నియమిత సమయంలో ఈ పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా న్యూఢిల్లీలో ఉన్న ఫ్లైఓవర్లు హ్యాంగింగ్ గార్డెన్‌లు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ, ఆకర్షనీయమైన పెయింటింగ్‌లతో పలువురుని ఆకట్టుకునే విదంగా తీర్చిదిద్దారు. న్యూఢిల్లీ మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లను కూడా అందంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతో జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్, బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఫ్లైఓవర్లను మరింత ఆకర్షనీయంగా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా మొదటి దశలో మాసబ్ ట్యాంక్, బషీర్‌బాగ్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, తెలుగుతల్లి, హరిహరాకళాభవన్, సి.టి.ఓ, బేగంపేట్ ఫ్లైఓవర్లను మరింత అందంగా విద్యుత్ దీపాలు, గ్రీనరి, పెయింటింగ్‌లతో అభివృద్ది చేస్తున్నారు. దీంతో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫ్లైఓవర్లను హెచ్.ఎం.డి.ఏ ద్వారా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఫ్లైఓవర్లకు ప్రైమరీ స్థాయిలో రంగులు వేయడం, విద్యుత్ దీపాల ఏర్పాటు, వైరింగ్ ఏర్పాటు చేయడం, ఫ్లైఓవర్ల క్రింద గార్డెనింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులన్నింటిని మే మాసాంతంలోగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Comments
Post a Comment