జూన్ 5 నుండి నిర్మాణ వ్యర్థాలను తరలించే అక్రమ వాహనాలపై బల్దియా ఉక్కుపాదం
Turn off for: Telugu
*జూన్ 5లోపు నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలు రిజిస్టర్ చేసుకోవాలి - మేయర్ రామ్మోహన్*
గ్రేటర్ హైదరాబాద్‌లో జూన్ 5వ తేదీ నుండి భవన నిర్మాణ వ్యర్థాలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో కాకుండా నాలాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో వేసే అక్రమ వాహనాలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు పై నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలైన క్రేడాయి, ట్రేడాయి, ఇతర నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్ తదితర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలోని బిల్డర్లు తమ ప్రాజెక్ట్‌ల నుండి నిర్మాణ వ్యర్థాలను తరలించే రవాణా వాహనాలన్నింటిని జూన్ 5వ తేదీలోగా జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ఏజెన్సీ హైదరాబాద్ సీ అండ్ డి వేస్ట్ ప్రాజెక్ట్ సంస్థ వద్ద ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయని, అయితే నగరంలో రహదారుల వెంట నాలాలు, చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా వేస్తున్నారని, దీని వల్ల నగర సుందరీకరణకు భంగం కలుగుతుందని వివరించారు. భవన నిర్మాణ వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకంగా ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు బహిరంగ వేలం ద్వారా హైదరాబాద్ భవన నిర్మాణ వ్యర్థాల ప్రాజెక్ట్‌కు అప్పగించడం జరిగిందని తెలిపారు. మెట్రిక్ టన్ను భవన నిర్మాణ వ్యర్థాలకు రూ. 342లుగా నిర్ణయించడం జరిగిందని, నిర్మాణ వ్యర్థాలను ఎంపికైన ఈ ప్రాజెక్ట్‌కు చెందిన వాహనాలు తరలిస్తాయని తెలిపారు. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్ట్‌ల నుండి నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు రిజిస్టర్ చేసుకున్న ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు వాహనాలకు మాత్రమే అప్పగించాలని, ఈవిషయంలో బిల్డర్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. జూన్ 5వ తేదీలోగా నగరంలో విధిగా నిర్మాణ వ్యర్థాలను రవాణాచేసే వాహనాలన్నీ రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన బ్రాండింగ్‌తో ఉన్న వాహనాలు మాత్రమే నిర్మాణ వ్యర్థాలను తరలించాలని, ప్రైవేట్ వాహనాలు నిర్మాణ వ్యర్థాలను తరలిస్తే వాటిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని చెప్పారు. నగరంలో నిర్మాణ వ్యర్థాలను బహిరంగంగాను, నాలాలు, చెరువుల్లో వేయడాన్ని నిరోధించడానికి దాదాపు 400మంది సిబ్బందితో సీ అండ్ డి ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని 30సర్కిళ్ల పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను తాత్కాలికంగా వేయడానికి ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 15ఏళ్లు దాటిన వాహనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్ల పై తిరగరాదని, ఈ నిబంధనలను ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు కూడా కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. జూన్ 5వ తేదీ అనంతరం గుర్తింపులేని వాహనాలు భవన నిర్మాణ వ్యర్థాలను తరలిస్తే ఆయా వాహనాలను సీజ్ చేయడంతో పాటు బారీ జరిమానాలు విధించి సంబంధిత బిల్డర్ల పై కూడా చర్యలు చేపట్టడానికి వెనకాడమని బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. ఈ సమావేశంలో నగరంలోని ప్రముఖ భవన నిర్మాణ సంస్థల యజమానులు, ప్రతినిధులు, హైదరాబాద్ సీ అండ్ డి వేస్ట్ ప్రాజెక్ట్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment