మాండలిక భాషలోనే వాస్తవిక కథలు రావాలి... Session - 2
పిల్లలకు నిత్య జీవిత వాస్తవాలను పరిచయం చేయాలి.....
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో జరిగిన "Different Childhoods, Different Tales" చర్చ కార్యక్రమంలో వక్తల పిలుపు
తూఫాన్(హైదరాబాద్) :- 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో భాగంగా అనిశెట్టి రజిత వేదిక పై ఆదివారం సాయంత్రం... రెండవ సెషన్ లో భాగంగా Different Childhoods, Different Tales చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డా.అస్మా రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. డా.షెఫాలీ ఝా, డా.గోగు శ్యామల, కనీజ్ ఫాతిమా, డాక్టర్ మధు మిత సిన్హా, డా.ఉమా భృగుబండ మాట్లాడారు.కార్యక్రమానికి అస్మా ఫాతిమా moderator గా వ్యవహరించారు.
షెఫాలీ ఝా ప్రసంగిస్తూ, బాల్య స్మృతులే మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తాయని, పుస్తక జ్ఞానాన్ని సామాజిక సేవతో ముడిపెట్టినప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. తన చిన్నతనంలో దర్గా ఆవరణలోని చింత చెట్టు కింద ఆడుకుంటూనే, అక్కడి మసీదు వెనుక ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలికి (ఖాలా) సహాయం చేసిన తీరును గుర్తుచేసుకుంటూ.. ఆనాటి సామాజిక అనుభవాలే తనలో మానవత్వాన్ని పెంపొందించాయని వివరించారు. ‘స్వేచ్ఛ’ వంటి నవలలు గుర్తింపునిస్తే, మహనీయుల చరిత్ర సామాజిక బాధ్యతను గుర్తుచేస్తుందని, జీవితం అనే పుస్తకంలో బాల్యం తొలి పుట వంటిదని, అందులో నేర్చుకున్న పేదలకు సహాయం చేసే గుణమే మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని షెఫాలీ ఝా స్పష్టం చేశారు.
ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల ప్రసంగిస్తూ, సాహిత్యం సమాజంలోని కఠిన వాస్తవాలను ప్రతిబింబించే అద్దమని అభివర్ణించారు. ‘తాటక’ వంటి కథల ద్వారా పల్లెటూరి శ్రామిక అమ్మాయిల ధైర్యసాహసాలను, ఆత్మవిశ్వాసాన్ని ఆమె వివరిస్తూ, ఆపద సమయాల్లో కేవలం నిరసనలకే పరిమితం కాకుండా స్వీయ రక్షణ పొందే శక్తిని సాహిత్యం ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాల్లో తరతరాలుగా సాగుతున్న భూపోరాటాలను ప్రస్తావిస్తూ, సీలింగ్ చట్టం ద్వారా దక్కిన భూమిని కాపాడుకోవడానికి బసన్న, బాలమ్మ వంటి శ్రామికులు పడుతున్న కష్టాలను, భూస్వాముల కుట్రలను ఆమె కళ్లకు కట్టారు. ‘స్వేచ్ఛ’ వంటి నవలలు మహిళా చైతన్యాన్ని రగిలిస్తే, ఈ యదార్థ గాథలు బతుకు పోరాటాన్ని పరిచయం చేస్తాయని.. ప్రతి పుస్తకం సమాజం పట్ల విమర్శనాత్మక అవగాహనను కలిగిస్తూ మనిషిని చైతన్యపథంలో నడిపించాలని గోగు శ్యామల ఆకాంక్షించారు.
ప్రముఖ అనువాదకురాలు కనీజ్ ఫాతిమా ప్రసంగిస్తూ, సాహిత్య అనువాదం అనేది కేవలం పదాల మార్పిడి కాదని, ఒక భాషలోని ఆత్మను మరో భాషలోకి తరలించే అద్భుత ప్రక్రియ అని అభివర్ణించారు. గోగు శ్యామల కథలను తెలుగు నుండి నేరుగా ఉర్దూలోకి అనువదించడంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ, ఉర్దూలోని ప్రాచీన పదాల కోసం తన తల్లి సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తెలుగు ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకలైన ‘తంగేడు పువ్వులు’, ‘నల్లలం ఆకులు’ వంటి పదాలను మార్చకుండా ఉర్దూలోనూ అలాగే వాడటం వల్ల ఆ కథల సహజత్వం దెబ్బతినలేదని ఆమె పేర్కొన్నారు. హిందీ, ఆంగ్ల అనువాదాల కంటే నేరుగా మూల భాష నుంచే అనువదించడం తనకు సంతృప్తిని ఇచ్చిందని, తెలుగు సాహిత్య సారాన్ని ఉర్దూ పాఠకులకు చేరువ చేయడంలో తాను సఫలమయ్యానని కనీజ్ ఫాతిమా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
డాక్టర్ మధుమిత సిన్హా ప్రసంగిస్తూ, 'అమ్మ' కథ అణగారిన వర్గాల విద్యా చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పెత్తందారీ శక్తులను ఎదిరించి తన బిడ్డను బడిలో చేర్పించిన ఒక సామాన్య తల్లి పోరాటాన్ని వివరిస్తూ, క్యాలెండర్ తేదీలు తెలియకపోయినా ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ పనులనే కాలమాన గుర్తులుగా ఆమె చెప్పిన తీరు ఆ వర్గాల జీవిత వాస్తవికతకు అద్దం పడుతుందని వివరించారు. పొలంలో విత్తనాలు నాటిన రోజున పుట్టిన ఆ బిడ్డే నేడు అక్షరాలను పేర్చుతూ గొప్ప రచయితగా ఎదగడం వెనుక తల్లి ఇచ్చిన స్ఫూర్తి అమోఘమని కొనియాడారు. సొంత జీవితానుభవాలను తరగతి గదిలోకి తీసుకువచ్చినప్పుడే విద్యకు సార్థకత చేకూరుతుందని, పుస్తకాలు కేవలం సమాచారాన్ని మాత్రమే కాకుండా మనిషికి ఒక ప్రత్యేక గుర్తింపును, సామాజిక బాధ్యతను అందిస్తాయని మధుమిత సిన్హా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
డాక్టర్ ఉమా భృగుబండ ప్రసంగిస్తూ, బాల్యం అంటే కేవలం అమాయకత్వం, ఉత్సాహం మాత్రమే కాదని.. ఆకలి, హింస, సామాజిక వివక్ష వంటి కఠిన వాస్తవాలు కూడా అందులో భాగమేనని గుర్తుచేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బాల సాహిత్యం కేవలం ఊహాలోకాలను సృష్టించడం లేదా సూపర్ హీరోల చుట్టూ తిరుగుతూ వాస్తవాల నుంచి పిల్లల దృష్టిని మళ్లిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని, అందుకే వారి నిత్య జీవితంలో వినే మాండలిక భాషలోనే కథలను అందించడం ద్వారా వారి జీవితాలను ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. 9 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లలకు సమాజం, భాష పట్ల సరైన అవగాహన కల్పించేలా తమ వాస్తవిక రచనలు ఉంటాయని వివరిస్తూ.. ఊహల నుంచి వాస్తవాల వైపు పిల్లల పఠనాసక్తిని మళ్లించాలని ఉమా భృగుబండ ఈ సందర్భంగా కోరారు.

Comments
Post a Comment