కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’
● నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ప్రణాళిక
● హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
● నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ
కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు.
నేరస్తులను కేవలం అరెస్టు చేయడమే కాకుండా.. వారికి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో అక్టోబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు, అక్విటల్ అయిన పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి.. ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు.
చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షిస్తూ.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, అవి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.
కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి కేసుకు ఒక స్పష్టమైన 'ప్లాన్ ఆఫ్ యాక్షన్' రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అలాగే సైబర్ క్రైమ్, మహిళా భద్రత, స్ట్రీట్ క్రైమ్, ఆహార కల్తీ కేసులపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాతనేరస్తులపై నిఘా పెంచాలని తమ పరిధిలో ఎలాంటి నేరాలను జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్.హెచ్.ఓలదే అని స్పష్టీకరించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై పి.డి.యాక్ట్ పెట్టాలని ఆదేశించారు.
సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించి దర్యాప్తు పూర్తి చేయాలని, తద్వారా శిక్షల శాతం (కన్విక్షన్ రేట్) పెంచేలా ప్రణాళికలు ఉండాలన్నారు. కఠిన శిక్షలు పడినప్పుడే నేరస్తుల్లో భయం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు సమాజములో పెరిగి పోతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తూ , వాటిని అదుపు చేసే విధంగా సాంకేతికతను పెంపోందించుకోవాలని, నిపుణుల సహాయముతో కేసులను దర్యాప్తు చేయాలని సూచించారు.
పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వెపన్ తమ వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. దీనికోసం ప్రతి 15 రోజులకోసారి వెపన్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రతి అధికారి తమ పరిధి (జురిస్డిక్షన్)పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని, ఎస్‌హెచ్‌ఓలు కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఈ నెలవారి నేర సమీక్ష సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్ తోపాటు వివిధ విభాగాలు, జోన్ల డీసీపీలు శ్రీమతి కె.అపూర్వా రావు ఐపీఎస్, శ్రీమతి శ్వేత ఐపీఎస్, శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్, శ్రీమతి ఎస్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్, శ్రీమతి కె.శిల్పావళి ఐపీఎస్, సి.రూపేశ్ ఐపీఎస్, శ్రీ.కె.కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్, శ్రీ.బి.బాలస్వామి ఐపీఎస్, శ్రీ.జి.చంద్రమోహన్, సిహెచ్.శ్రీనివాస్, శ్రీ.వి.అరవింద్ బాబు, శ్రీమతి పి.లావణ్య నాయక్ జాదవ్ తో పాటు అన్ని అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ వోలు పాల్గొన్నారు.

Comments
Post a Comment