కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్
కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్
హైదరాబాద్, కంటోన్మెంట్: కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ అభివృద్ధికి భారీ నిధులను విడుదల చేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2024లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూమి బదిలీకి బదులుగా కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకే మళ్లించాలని బోర్డు తీర్మానం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ మేరకు తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాసినట్టు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ఈ లేఖలు, బోర్డు తీర్మానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర రక్షణ శాఖ తాజాగా రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోకి నేరుగా జమచేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈటల తెలిపారు. అదనంగా రూ.11 కోట్ల గ్రాంట్‌ను కూడా విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
వర్షపు నీరు, డ్రైనేజ్ కు భారీ ప్రాజెక్టులు
ఈ నిధులతో భాగంగా రూ.160 కోట్లతో రెండు స్టామ్ వాటర్ డ్రెయిన్‌లను నిర్మించనున్నారు. ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండవది రసూల్‌పూర్ బస్తీల మీదుగా సాగనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు SNDP మాదిరిగానే నిర్మించనున్నట్టు చెప్పారు. దీంతో కంటోన్మెంట్, బోయినపల్లి ప్రాంతాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు.
ఇకపై రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పార్కులు, రోడ్లు, వరద కాలువలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నామని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం సహజసిద్ధంగా శుభ్రమైన వాతావరణం కలిగినదని, ఇక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా రెండు డిగ్రీలు తక్కువగా ఉంటుందని అన్నారు.
డబుల్ బెడ్‌రూమ్‌లు, బోర్డు ఎన్నికలపై ప్రకటన
కంటోన్మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల తెలిపారు. సాధారణంగా రక్షణ శాఖ భూములకు బదులుగా వచ్చే నిధులు కేంద్ర ఖాతాలోకే వెళ్తాయని, కానీ తొలిసారిగా బోర్డు ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేయడం ఇది గొప్ప విషయమని అన్నారు. ఇందుకు సహకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కంటోన్మెంట్ పాలక మండలి ఏర్పాటును తాము కూడా కోరుకుంటున్నామని, త్వరలో బోర్డు ఎన్నికలు జరగనున్నట్లు ఆశిస్తున్నామని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు మెంబర్ నర్మద మల్లిఖార్జున, కార్పొరేటర్ దీపిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment