ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థ బలోపేతానికి డీజీపీ కార్యాలయంలో సమీక్ష: సమన్వయానికి కొత్త మార్గదర్శకాలు
డిజిపి కార్యాలయంలో ఖైదీల ఎస్కార్ట్ పై గురువారం నాడు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఖైదీల ఎస్కార్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన మార్గదర్శకాలను శాంతి భద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ జారీ చేశారు. నూరు శాతం ఖైదీల ఎస్కార్ట్ ను సమర్ధంగా చేసిన వారిని వ్యక్తిగతంగా అభినందించారు.
ఇతర రాష్ట్రాలతో సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్కార్ట్ అభ్యర్థనల కోసం రేడియో సందేశాలు కనీసం ఒక వారం ముందే పంపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది మెరుగైన ప్రణాళికకు దోహదపడుతూ, చివరి నిమిషపు లాజిస్టికల్ సమస్యలను నివారించగలదని అన్నారు. అన్ని సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం, లా అండ్ ఆర్డర్, సి ఏ ఆర్, జైళ్లు, కోర్టు అనుసంధానం విభాగాల అధికారులతో కలిసి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఖైదీల ఎస్స్కార్టు తేదీలు, సమయాలు, ఎస్కార్ట్ ఏర్పాట్లపై తక్షణ సమాచారం మార్పిడి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో బయట ఖైదీ ఎస్కార్ట్ శాతం తక్కువగా ఉండే యూనిట్లపట్ల ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ భగవత్ ఎస్కార్ట్ విధులను మరింత సమర్థంగా నిర్వహించేలా, విశ్వసనీయత మరియు లోపాలను తగ్గించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టులకు హాజరయ్యే పేరుమోసిన నేరస్తుల విషయంలో శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని, ఎస్కార్ట్ విధులకు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని సూచించారు.ఖైదీ ఎస్కార్ట్ సమయంలో ఖైదీలు తప్పించుకునే సంఘటనలలో , భారత న్యాయ సంకేతం (BNS) ప్రకారం సెక్షన్లు 224, IPC సెక్షన్లు 261, 262 కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలపై ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సిబ్బందికి తగిన అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆయన వివరించారు. రాబోయే గణేష్ ఉత్సవం, స్థానిక సంస్థల ఎన్నికల వంటి సందర్భాల్లో ఒత్తిడి పెరగనుండటంతో, ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశ పెట్టేందుకు జిల్లా న్యాయమూర్తులతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఏదైనా జిల్లాలో వాహనాలు లేదా డ్రైవర్ల కొరత వున్నచో, తదుపరి సమీక్ష సమావేశాన్ని ఎదురుచూడకుండా, వెంటనే సంబంధిత సీనియర్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఖైదీల భద్రత, చట్టబద్ధత మరియు గౌరవాన్ని పరిరక్షిస్తూ, బాధ్యతాయుత విభాగాల సమర్థత, సమన్వయం, జవాబుదారీతనం అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సమావేశంలో రక్షిత కె. మూర్తి డీసీపీ , సిఏ ఆర్ ప్రధాన కార్యాలయం; శాంతి భద్రతల ఏఐజి రమణ కుమార్, జైళ్ల శాఖ డిఐజి డి.శ్రీనివాస్; సిపిఎల్, సి ఏ ఆర్ ప్రధాన కార్యాలయం మరియు ఇతర సంబంధిత విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Comments
Post a Comment