*మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతంలో పర్యటించిన సీఎంఓ అధికారులు*
*నర్సాపూర్ అడవి పునరుజ్జీవనం కోసం
ప్రభుత్వ ముమ్మర ప్రయత్నాలు*
*సహజ అడవిని కాపాడుతూ, ఎకో టూరిజం కేంద్రాల అభివృద్దికి చర్యలు*
ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండి, తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల
క్షీణించిన ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవికి పూర్వ
వైభవం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అటవీ సంపదకు, జంతుజాలానికి పట్టుగొమ్మగా ఉన్న
నర్సాపూర్ అడవులను ఖచ్చితంగా పునరుజ్జీవనం
చేసుకోవాలని, అందుకోసం తక్షణ చర్యలు తక్షణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.
చంద్రశేఖరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధానాధికారి (Pccf) పీ.కే. ఝా, హరితహారం osd ప్రియాంక వర్గీస్ నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. మెదక్
జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అటవీ శాఖ ఛీప్ కన్జర్వేటర్ ఏ.కె. సిన్హా, జిల్లా అటవీ అధికారి పద్మజా రాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ముందుగా అటవీ ప్రాంతంలో విసృతంగా పర్యటించిన ఉన్నతాధికారులు ఆ తర్వాత
నర్సాపూర్ అటవీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుమారు 3,470 హెక్టార్లలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ భాగాన్ని పూర్తి
స్థాయిలో రక్షించటంతో పాటు ఆ ప్రాంతం గుండా పర్యటించేవారికి అహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 40 కిలో మీటర్ల పొడవునా అటవీ ప్రాంతాన్ని కవర్ చేస్తూ సీ త్రూ వాల్ ను ( అడవి
కనపించేలా ) నిర్మించనున్నారు. దీనివల్ల అడవి ఆక్రమణలకు గురికాకుండా ఉండటంతో పాటు, సహజమైన అడవిని కాపాడుకునే చర్యలకూ ఉపయోగపడుతుందని నిర్ణయించారు. నర్సాపూర్
పట్టణానికి సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో అర్బన్
ఫారెస్ట్ పార్కుతో పాటు ఎకో టూరిజం కేంద్రాన్ని కూడా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న చెరువును కూడా పూర్తి
స్థాయిలో పునరుద్దరించనున్నారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులను
చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సీఎం ఆదేశాల మేరకు నర్సాపూర్ అటవీ ప్రాంతంలో
పర్యటించిన అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ భూములను
పరిరక్షిస్తూ పర్యాటక కేంద్రంగా
అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలను తయారు చేశామని, వెంటనే పనులు ప్రారంభిస్తామని
వెల్లడించారు.
కోతుల బెడద నివారణకు, అటవీ ప్రాంతంలోనే కోతులు నివసించేందుకు
వీలుగా చర్యలు తీసుకుంటామని త్వరలో ప్రారంభమయ్యే నాలుగో
విడత హరితహారంలో కోతుల ఆహారానికి అనువైన చెట్లను అటవీ ప్రాంతంలో నాటనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Post a Comment