రూ. 450 కోట్ల వ్యయంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది
రూ. 450 కోట్ల వ్యయంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది
హెచ్.ఆర్.డిలో ప్రారంభమైన స్వచ్ఛ ఐకానిక్ జాతీయ సదస్సు
దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌లుగా గుర్తించి వాటిని రూ. 450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ది చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, సానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డితో కలిసి అక్షయ్ రౌత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుండి వచ్చిన సీనియర్ అధికారులు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ క్రింద చేపట్టిన పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్షయ్ రౌత్ మాట్లాడుతూ మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఐకానిక్ ప్రాంతాలుగా గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ది చేయడానికి ఒకొక్క ప్రాంతానికి ఒకొక్క కార్పొరేట్ సంస్థకు అప్పగించామని తెలిపారు. మొదటి రెండు దశల్లో ఎంపిక చేసిన 20 ఐకానిక్ ప్రాంతాల్లో స్వచ్చత కార్యక్రమాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి కేటాయించిన రూ. 450కోట్ల రూపాయల్లో ఇప్పటికే రూ. 192 కోట్ల వ్యయం చేశామని తెలిపారు. దేశంలోని స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలు, దాదాపు అధిక శాతం పర్యాటక ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయని, వీటితో పాటు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలు రావడం సవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ 400 ఏళ్లకు పైగా చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద గలిగిన హైదరాబాద్ నగరంలో చార్మినార్ పరిసర ప్రాంతాల అభివృద్ది కి అతిపెద్ద చార్మినార్ పాదాచారుల ప్రాజెక్ట్ ను ప్రారంభించామని పేర్కొన్నారు. దేశీ-స్వచ్చత ఉంటేనే ఏ ప్రముఖ స్థలాలకైనా పర్యాటకులు అధిక సంఖ్యలో నిత్యం వస్తారని, ఈ నేపథ్యంలోనే చార్మినార్ వద్ద నిత్యం సానిటేషన్‌ను చేపట్టామని పేర్కొన్నారు. ఆది, సెలవు దినాల్లో చార్మినార్‌ను దాదాపుగా 35 వేల మంది సందర్శిస్తున్నారని తెలిపారు. ఐకానిక్ ప్లేసెస్‌లలో స్వచ్ఛ కార్యక్రమాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన కార్పొరేట్ సంస్థలు నిధుల విడుదలతో మరింత సరళీకృతంగా ఉండాలని డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. 35.10 కోట్ల జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం నిధులతో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. జీహెచ్ఎంసీ నుండి రూ. 27 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు రూ. 20 కోట్ల వ్యయం చేసి చార్మినార్ చుట్టూ ఫ్లోరింగ్, పత్తర్‌గట్టి ఆర్కేడ్‌ల పునరుద్దరణ, చార్ కమాన్‌ల పునరుద్దరణ, మహబూబ్ చౌక్‌లోని క్లాక్ టవర్ అభివృద్ది తదితర పనులను చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ భారతి హోలీకేరి, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌లకు సంబంధించి మూడవ జాబితాను స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన అభివృద్ది పనులపై పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు.
Comments
Post a Comment