*సఫాయి కర్మచారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు - జాతీయ కర్మచారి కమీషన్ ఛైర్మన్ వజీభాయ్*
*సఫాయి కర్మచారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు - జాతీయ కర్మచారి కమీషన్ ఛైర్మన్ వజీభాయ్*
సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కృషిచేసే సఫాయి కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా జాతీయ కర్మచారి కమీషన్ ఛైర్మన్ మన్హర్ వజీభాయ్ జాల అధికారులకు సూచించారు. సఫాయి కర్మచారిల సంక్షేమంపై చేపట్టిన చర్యలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, జలమండలి ఎండి దానకిషోర్, జీహెచ్ఎంసీ జలమండలి కార్యాలయాల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ కర్మచారి కమీషన్ ఛైర్మన్ మన్హర్ వజీభాయ్ జాల మాట్లాడుతూ హైదరాబాద్ నగరం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోని ప్రధాన నగరాల కన్నా అగ్రస్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ దీనికి ప్రధాన కారణమైన పారిశుధ్య కార్మికులకు ఈ ఘనత లభిస్తుందని పేర్కొన్నారు. దేశాన్ని సైనికుడు ఎలా రక్షిస్తాడో సమాజాన్ని స్వచ్చంగా ఉంచడానికి సఫాయి కార్మికులు నిస్వార్థంగా పనిచేస్తారని అన్నారు. గతంతో పోలిస్తే హైదరాబాద్ నగరం స్వచ్చత విషయంలో ఎంతో మెరుగ్గా ఉందని అభినందిస్తూ దీనికి కారణమైన పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మ్యానవల్ స్కావెంజింగ్ పూర్తిగా నిషేదించడం జరిగిందని, స్కావెంజర్ల పునరావాస చర్యలు చేపట్టడంతో పాటు వారికి ఆర్థిక సహాయం, ప్రత్యేక శిక్షణ, గృహనిర్మాణం, వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించాలని ఛైర్మన్ స్పష్టం చేశారు. స్కావెంజర్లకు రూ. 40వేలు ఆర్థిక సహాయాన్ని అందించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని గుర్తుచేశారు. పారిశుధ్య కార్యక్రమాల విధుల నిర్వహణలో చిత్తశుద్దితో పనిచేసి దేశవ్యాప్త గుర్తింపు పొందిన వెంకటయ్య పలువురికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 22వేల మంది పారిశుధ్య కార్మికులకు అత్యధిక మొత్తంలో వేతనాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్మికులందరికీ ప్రతినెలా వైద్య పరీక్షలు కల్పించడంతో పాటు పలు రకాల బీమా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 242 మ్యానవల్ స్కావెంజర్లకు జీహెచ్ఎంసీలో శానిటేషన్ వర్కర్లుగా ఔట్ సోర్సింగ్ పద్దతిపై ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. పారిశుధ్య కార్మికుల భద్రతకు అన్ని రకాల చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జలమండలి ఎండి దానకిషోర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో మురుగునీటి కాలువల క్లీనింగ్‌కు దాదాపు 600మంది వర్కర్లు పనిచేసేవారని, ఈ పనులను చేపట్టడానికి ప్రత్యేకంగా ఎయిర్‌టెక్ మిషన్లను కొనుగోలుచేసి వాటిని సఫాయి కర్మచారిలకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, రవికిరణ్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, జీహెచ్ఎంసీకి చెందిన మెడికల్ ఆఫీసర్లతో పాటు సఫాయి కర్మచారి ఆందోళన్, వాల్మికి మహాసభ, అఖిల భారత వాల్మికి సభ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Post a Comment