వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించింది




·        పండగ వాతావరణంలో రైతు బంధు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ
·        బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి ఒక్క పథకం ఉందా
·        టిఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్, బిజెపిలకు లేదు
·        అధికారం ఉన్నపుడు అక్రమాలు, అవినీతికి పాల్పడిన దద్దమ్మలు, సన్నాసులు కాంగ్రెస్ నేతలు
·        ప్రజల సొమ్మును నిసిగ్గుగా తిని జైళ్ల వెంట తిరుగుతున్నారు
·        ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తర కుమార ప్రగల్భాలు..ఆయన చెప్పేవాటికి పార్టీ విధానం లేదు
·        రైతు బంధు విజయవంతం చేసిన రైతులు, అధికారులు, మీడియా, ఇతరులందరికీ కృతజ్ణతలు
·        రైతుబంధుపై విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

వరంగల్, మే 18 : రైతు బంధు పథకంతో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని, సిఎం కేసిఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో చాలామందిని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసి, ఇక్కడకొచ్చి అధ్యయనం చేసేలా ఆకర్షిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వ్యవసాయానికి పెట్టుబడి కింద ఏటా ఎకరానికి 8000 రూపాయలు తెలంగాణలో అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసి, రైతును రాజు చేసే కార్యక్రమాన్ని సిఎం కేసిఆర్ చేస్తున్నారని తెలిపారు. మే 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఐదు జిల్లాల్లో రైతు బంధు కార్యక్రమం విజయవంతం కావడంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రసంగించారు.
        తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో చెప్పడానికి మేనిఫెస్టో కమిటీ వేశారని, దానికి తనను చైర్మన్ గా చేసి లక్ష రూపాయలలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని, 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తామని అందులో రాయమంటే...ఇవి సాధ్యమా అని నేను సందేహం వ్యక్తం చేశాను, కానీ సిఎం కేసిఆర్ మనసుంటే మార్గముంటదని చెప్పి వాటిని చేసి చూపించారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో 38 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా 17వేల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. అధికారం చేపట్టిన  ఆరు నెలల్లోనే 9 గంటల ఉచిత కరెంటు ఇచ్చారని, ఇప్పుడు 24 గంటల ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తున్నారని, దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో ఇలా కరెంటు ఇవ్వడం లేదన్నారు. భారతదేశంలో ఇదొక చరిత్ర అన్నారు.
         ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి రైతులు రైతు బీమా పథకాన్ని సిఎం కేసిఆర్ అమలు చేయబోతున్నారని తెలిపారు. రైతు కుటుంబంలో ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తున్నారని చెప్పారు.
        వీటన్నింటికి మించి రైతు బంధు పథకం ద్వారా రైతుకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదిలో 8000 రూపాయలు ఇస్తున్నారని, ఇలా పంట పెట్టుబడి ఇస్తున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ అన్నారు. కేవలం రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడమే కాకుండా ఈ నగదును రైతు పాత అప్పుకింద, బాకి కింద వసూలు చేయకూడదని బ్యాంకులకు కచ్చితమైన ఆదేశాలిచ్చారన్నారు. కేంద్రంతో మాట్లాడి 5700 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో నగదు పెట్టించారన్నారు. ఒక పథకాన్ని రూపొందించడంలో ఆయన తీసుకున్న శ్రద్ధ, ముందుచూపు వల్లే నేడు రైతు బంధు పథకం ఎలాంటి చిన్న అపశృతి లేకుండా ప్రతి ఊరిలో పండగలా జరిగిందన్నారు.
        కొంతమంది రాజకీయ దురుద్దేశ్యంతో  విమర్శలు చేస్తున్నారని, దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న ఇంతమంచి కార్యక్రమాన్ని కనీసం ఆహ్వానించే పెద్ద మనసు లేకపోవడం విచారకరమన్నారు. 29 రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బిజెపి అధికారంలో ఉన్నాయని అయితే ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను, రైతులకు పంట రుణ మాఫీని, ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా  అందుబాటులో ఉంచడాన్ని, 5 లక్షల రూపాయల రైతు బీమా పథకాన్ని, రైతులకు పంట పెట్టుబడి పథకాన్ని అమలు  చేస్తున్నారా?అని ప్రశ్నించారు. ఇవేవి చేయని ఆ పార్టీ నేతలకు ఇక్కడ టిఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతును పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. మేం అధికారంలోకి వస్తే రైతు కోసం అనేకం చేస్తామని ప్రకటించిన బిజెపి ఇప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి  తీసుకొని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. గిట్టుబాటు ధరలు పెంచాలని సిఎం కేసిఆర్ అనేకసార్లు కేంద్రాన్ని కోరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు బిజెపి ముందుకు రావడం లేదన్నారు.
        కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిందని, అవినీతి చేసిందని అధికార దుర్వినియోగానికి పాల్పడి నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును దోచుకుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. చేసిన వాటికి ఇంకా జైళ్లకు తిరుగుతున్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని, రైతుకు రెండు లక్షల రూపాయల పంట రుణ మాఫీ చేస్తామని చెబుతున్నారని, అలాంటప్పుడు వారి పార్టీ విధానంగా ఎందుకు ప్రకటించడం లేదని అడిగారు. ఇంకా మభ్యపెట్టి మసిపూసే కార్యక్రమాలు చేయడం మంచిదికాదని సూచించారు.
        తెలంగాణ రాష్ట్రంలో రైతు కోసం చేస్తున్న పథకాలు చూసి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక ప్రజలు మాక్కూడా ఇలాంటి పథకాలు కావాలని అడుగుతున్నారని ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. కాంగ్రెస్ దద్దమ్మలు, సన్నాసులు  అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుడ్డిగా విమర్శించే పద్దతి మానుకోవాలన్నారు.
        రైతుబంధు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులు, ఉద్యోగులు, మీడియా, ఇతర వర్గాలందరికీ కృతజ్ణతలు తెలుపుతున్నానని చెప్పారు.
        పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని ఇప్పుడున్న ఐదు జిల్లాల్లో 32,94,602 ఎకరాల భూమి ఉంటే, ఇందులో 22,32,197 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందన్నారు. మొత్తం 1587 రెవెన్యూ గ్రామాల్లో రైతు బంధు పథకం కింద 1300 రెవెన్యూ గ్రామాలను కవర్ చేశారన్నారు. ఇందులో మొత్తం 7,12,573 పట్టాదారు పాస్ పుస్తకాలు రాగా, 5,32,159 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారన్నారు. అదేవిధంగా 6,78,237 చెక్కులు ఈ జిల్లాలకు రాగా, వీటిలో 4,56,788 చెక్కులను పంపిణీ చేశారని చెప్పారు. ఈ ఐదు జిల్లాలకు కలిపి 534 కోట్ల లక్ష రూపాయల 81వేల 690 రూపాయలు రాగా, ఇందులో 424 కోట్ల, 76 లక్షల, 39వేల 664 రూపాయలు రైతులకు ఇచ్చారన్నారు. కొంతమంది రైతులు అందుబాటులో లేకపోవడం, అనారోగ్యంతో రాకపోవడం, తర్వాత వచ్చి తీసుకుందామని అనుకోవడం వల్ల వారికి ఈ సమావేశాల్లో ఇవ్వలేకపోయారని, అయితే వీరందరికీ చెక్కులు 20వ తేదీ తర్వాత అందిస్తారని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతూ మీటింగ్ లకు రాలేని రైతులకు ఇంటి వద్దకు వెళ్లి ఇస్తారని, మిగిలిన వారికి మండల కార్యాలయంలో అందుబాటులో ఉంచుతారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పంట పెట్టుబడి అందుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
        ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ నన్నపనేని నరేందర్, రాష్ట్ర మహిళా ఆర్ధిక సంస్థ చైర్ పర్సన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి